ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

No Signals... Services Disrupted! సిగ్నల్స్‌ లేక.. సేవలు అందక!

ABN, Publish Date - Apr 29 , 2025 | 11:19 PM

No Signals... Services Disrupted! ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు సచివాలయాల్లో ఫైబర్‌ నెట్‌ సక్రమంగా పనిచేయడం లేదు. పూర్తిస్థాయిలో సిగ్నల్స్‌ అందడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడం, నెట్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గిరిజనులకు అందాల్సిన సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.

టీకే జమ్ములో సిగ్నల్స్‌ లేక సచివాలయంలో నిరీక్షిస్తున్న గిరిజనులు
  • గిరిజనులకు తప్పని నిరీక్షణ

  • ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి..

  • గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టవర్ల ఏర్పాటు

  • కొరవడిన పర్యవేక్షణ.. పకడ్బందీ చర్యలు శూన్యం

జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు సచివాలయాల్లో ఫైబర్‌ నెట్‌ సక్రమంగా పనిచేయడం లేదు. పూర్తిస్థాయిలో సిగ్నల్స్‌ అందడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడం, నెట్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గిరిజనులకు అందాల్సిన సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. గిరి శిఖర గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత ఎనిమిది నెలలుగా ఈ సమస్య వేధిస్తుండగా స్పందించే వారే కరువయ్యారు. దీంతో అటు ఉద్యోగులు, ఇటు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ పరిస్థితి..

జియ్యమ్మవలస మండలంలో టీకే జమ్ము, పీటీ మండ, కొండచిలకాం పంచాయతీల పరిధిలో 22 గిరిజన గ్రామాలు ఉన్నాయి. గతంలో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఆఫ్‌లైన్‌లోనే సేవలు అందేవి. అయితే గిరిజన ప్రాంతాల్లో డిజిటల్‌ సేవలు అందించేందుకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీకే జమ్ము, పీటీ మండలో సెల్‌ టవర్లు నిర్మించారు. దీనికి ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. అయితే కొంతవరకు పరిస్థితి మెరుగుపడినా.. కాలక్రమంలో సిగ్నల్‌ సమస్య మాత్రం తీవ్రంగా వేధిస్తోంది. సచివాలయం ద్వారా ఈ మూడు పంచాయతీల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఫైబర్‌ నెట్‌ మరమ్మతులకు గురైనా పట్టించుకునే వారే లేరు. దీంతో ప్రభుత్వ సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. కొన్నిసార్లు సిగ్నల్స్‌ ఉన్న ఘాట్‌ రోడ్లకు సచివాలయ ఉద్యోగులు పరుగులు తీస్తున్నారు. ఇదే సమయంలో పీ4 సర్వే సమయంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీకే జమ్ము పంచాయతీలో రేషన్‌ పంపిణీ విషయంలో ఇక్కట్లు తప్పడం లేదు. సెల్‌ఫోన్‌ ద్వారా ఇతర ప్రాంత ప్రజలకు మాట్లాడాలన్నా కష్టమే. జియ్యమ్మ వలసతో పాటు సీతంపేట, భామిని, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, మక్కువ, పాచిపెంట మండలాల్లోని ఏజెన్సీ పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

అందాల్సిన సేవలు

సచివాలయాల ద్వారా కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువపత్రాలను ప్రజలకు జారీ చేయాల్సి ఉంది. పింఛన్లు, రేషన్‌ కార్డులు, నూతన గృహాల మంజూరు దరఖాస్తులతో పాటు ఆధార్‌ అప్‌డేషన్‌, రేషన్‌ కార్డుదారుల ఈకేవైసీ వంటి ఎన్నో రకాల సేవలు అందాల్సి ఉంది. కానీ ఫైబర్‌ నెట్‌ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేవలందేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

దారుణంగా ఉంది

ఏజెన్సీ ప్రాంతంలో సిగ్నల్స్‌ పరిస్థితి దారుణంగా ఉంది. నెట్‌ సిగ్నల్‌ లేక తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వ పథకాలు అందడం కష్టమైపోతుంది.

- ఆరిక శారద, సర్పంచ్‌, పీటీ మండ

================================

పరిష్కరించాలి..

ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా సిగ్నల్స్‌ అందేలా చూడాలి. తూతూ మంత్రంగా పనలు చేపట్టి.. ఒకట్రెండు రోజులకే సిగ్నల్స్‌ పరిమితమయ్యేలా చేయకూడదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

- అడ్డాకుల భారతి, సర్పంచ్‌, టీకే జమ్ము

================================

ఆందోళన చేస్తాం

ఫైబర్‌ నెట్‌ విషయంలో కచ్చితమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారా ఏజెన్సీవాసులకు డిజిటల్‌ సేవలు అందేలా చూడాలి. ఈ సమస్యను పరిష్కరించకుంటే గిరిజనులతో కలిసి ఆందోళన చేస్తాం.

- కొల్లి సాంబమూర్తి, సీఐటీయూ నాయకుడు, కొమరాడ మండలం

================================

ప్రత్యామ్నాయం చూడాలి

గతంలో ఫైబర్‌ నెట్‌ ద్వారా సిగ్నల్స్‌ అందించే ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం సిగ్నల్స్‌ లేకపోతే సచివాలయ ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. అంతేకాని ప్రభుత్వ సేవలకు విఘాతం కలిగించరాదు.

- టి.కొండలరావు, డీపీవో, పార్వతీపురం మన్యం

Updated Date - Apr 29 , 2025 | 11:19 PM