No Price, Only Despair ధర లేక దిగాలు
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:11 AM
No Price, Only Despair ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటకు గిట్టుబాటు ధర లేక తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించింది. ఈ కారణంగా ఆయిల్ పామ్ గెలల ధర పతనమైంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడమే కారణం
ఆందోళనలో ఉమ్మడి జిల్లా రైతులు.. ఆదుకోవాలని విన్నపం
కురుపాం,జూన్19(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటకు గిట్టుబాటు ధర లేక తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించింది. ఈ కారణంగా ఆయిల్ పామ్ గెలల ధర పతనమైంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కేంద్ర సర్కారు చర్యలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. వాస్తవంగా ఉమ్మడి జిల్లాలో ఏడు వేల హెక్టార్లలో సుమారు నాలుగు వేల మంది ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. నాలుగు వేల ఎకరాల్లో పాత తోటలు ఉండగా, మరో 3 వేల ఎకరాల్లో పంట రానున్న ఆరు నెలలు, ఏడాదిలో చేతికి రానుంది. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. కాగా సాగు ఖర్చుల కంటే తక్కువ ధర రావడంతో గతంలో చాలామంది రైతులు తోటలను తొలగించారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. అయితే ఇటీవల కాలంలో ధర ఆశాజనకంగా ఉండడంతో మళ్లీ ఆయిల్‌పామ్ సాగుపై మొగ్గు చూపారు. కాగా కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో గెలల ధర తగ్గింది. గత నెలలో టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ20,290 వరకు ఉండేది. దిగుమతి సుంకం తగ్గించిన తర్వాత రూ.18,600 కు ధర పడిపోయింది. రానున్న రోజుల్లో టన్నుకు మరో రూ.3 వేలు తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
50 శాతం పెంచాలి
దిగుమతి సుంకాన్ని 50 శాతం పెంచి రైతులను ఆదుకోవాలి. అధిక దిగుబడి ఇచ్చే సీడ్‌ను పంపిణీ చేయాలి. మొక్కల సబ్సిడీ బకాయిలు నిధులను వెంటనే విడుదల చేయాలి. గ్రేడింగ్ పేరుతో కర్మాగారాలు గెలలను కోనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపో తున్నారు. పార్వతీపురంలో పామాయిల్ కర్మాగారం ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- ఉదయ శేఖర్ పాత్రుడు, జనరల్ సెక్రటరీ, ఆయిల్ పామ్ రైతుల సంఘం, కురుపాం
===========================
దిగుమతి సుంకం తగ్గించడం వల్లే..
కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ప్రస్తుతం గెలల ధర తగ్గింది. రానున్న రోజుల్లో ఈ ధర ఎంత మేరకు తగ్గుతుందని చెప్పలేం.
- క్రాంతి కుమార్, ఉద్యాన శాఖాధికారి, పార్వతీపురం
Updated Date - Jun 20 , 2025 | 12:11 AM