Farmers రైతులకు ఏ కష్టం రానివ్వం
ABN, Publish Date - Jul 06 , 2025 | 11:15 PM
No Hardship Shall Befall Farmers జిల్లాలో అన్నదాతలకు ఏ కష్టం రానివ్వ బోమని మంత్రి సంధ్యారాణి తెలిపారు. శివారు భూములకూ సాగునీరందిస్తామన్నారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ప్రాంతంలోని తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ద్వారా ఆదివారం సాగునీరు విడుదల చేశారు. నాగావళి నదికి జలహారతి ఇచ్చి.. ఖరీఫ్‌లో పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు.
శివారు భూములకూ సాగునీరిందిస్తాం
నిర్వాసితుల త్యాగాలు మరువలేనివి
జంఝావతి సమస్య పరిష్కారానికి కృషి
లస్కర్ల నియామకానికి చర్యలు
మంత్రి సంధ్యారాణి
తోటపల్లి ద్వారా సాగునీరు విడుదల
పార్వతీపురం/గరుగుబిల్లి, జూలై6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్నదాతలకు ఏ కష్టం రానివ్వ బోమని మంత్రి సంధ్యారాణి తెలిపారు. శివారు భూములకూ సాగునీరందిస్తామన్నారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ప్రాంతంలోని తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ద్వారా ఆదివారం సాగునీరు విడుదల చేశారు. నాగావళి నదికి జలహారతి ఇచ్చి.. ఖరీఫ్‌లో పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ వ్యవసాయానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2013లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటపల్లి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి పనుల వేగవంతానికి చర్యలు తీసుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. పెండింగ్ పనుల పూర్తిగా భారీగా నిధులు మంజూరు చేస్తోంది. తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఈ ప్రాంత రైతులు చేసిన త్యాగాలు మరువలేం. వారి వల్లే ఉత్తరాంధ్ర సస్యశ్యా మలంగా ఉంది. పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో కుడి ప్రధాన కాలువ నుంచి 1,31,221 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. తొలుత 17 మండలాల పరిధిలోని చెరువుల కోసం సాగునీరు విడుదల చేశారు. తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని కుడి, ఎడమ కాలువల నుంచి 64 వేల ఎకరాలకు నీరు సరఫరా చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఎంఎఫ్ గ్రాంట్ కింద కుడి ప్రధాన కాలువలో జంగిల్ క్లియరెన్స్, పూడిక తీత పనులు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమైన పనులు చేపట్టేందుకు సుమారు రూ. 67 లక్షలు మంజూరు చేసింది.’ అని తెలిపారు.
సీఎం దృష్టికి జంఝావతి సమస్య
‘జంఝావతి ప్రాజెక్టు సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుడు దృష్టికి తీసుకెళ్లాం.ఒడిశా ముఖ్యమంత్రితో చర్చలు జరిపేందుకు చర్యలు చేపడుతున్నాం. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులపై చిన్న చూపు చూసి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. కొద్ది రోజుల్లో పూర్ణపాడు - లాబేసు వంతెన పనులు పూర్తికానున్నాయి.’ అని మంత్రి వెల్లడించారు. లస్కర్ల నియామకానికి ప్రతిపాదనలను అందించాలని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న ఉపాధి పనులకు సర్పంచ్‌లు ఆటంకాలు కల్పించరాదని సూచించారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కోరారు. అంతకముందు ఎన్టీఆర్, సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాలకు వారు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
భూ సమస్య పరిష్కారం..
పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి భూసమస్య పరిష్కారమైందన్నారు. ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. నిర్వాసితుల సమస్యలు దాదాపుగా పరిష్కారమయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతం పర్యాటకానికి అనుకూలంగా ఉందని, తోటపల్లికి ప్రత్యేక గుర్తింపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జల వనరులశాఖ ఎస్‌ఈ స్వర్ణకుమార్, ఈఈ మన్మఽథరావు, డీఈఈలు టి.రఘునాథనాయుడు, బి.గోవిందరావు, జేఈలు బి.కిషోర్‌కుమార్, శ్రీనివాసరావు , టీడీపీ రా ష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్, ట్రైకార్ డైరెక్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 06 , 2025 | 11:15 PM