No Funds.. No Water నిధుల్లేవ్.. నీరూలేదు
ABN, Publish Date - May 03 , 2025 | 11:14 PM
No Funds.. No Water వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చడానికి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెల్లో నీరు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ‘పల్లె పండుగ’ పేరుతో ఉపాధి హామీ పథకం కింద పనులు పూర్తి చేసినా.. నీరు నింపడంపై దృష్టి సారించడం లేదు.
వాటి నిర్మాణాలు పూర్తయినా విడుదల కాని నిధులు
వేతనాల కోసం ఎదురుచూస్తున్న ఉపాధి కూలీలు
గరుగుబిల్లి, మే3(ఆంధ్రజ్యోతి): వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చడానికి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెల్లో నీరు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ‘పల్లె పండుగ’ పేరుతో ఉపాధి హామీ పథకం కింద పనులు పూర్తి చేసినా.. నీరు నింపడంపై దృష్టి సారించడం లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిధిలో నీటి తొట్టెల నిర్మాణం దాదాపుగా పూర్తయినా నిధులు మాత్రం విడుదల కాలేదు. మరోవైపు ఉపాధి వేతనదారులు కూడా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో 2.29 లక్షల మూగ జీవాలు, 47 వేల నల్ల జాతి దున్నలు, 2.07 లక్షల గొర్రెలు, 1.73 లక్షల మేకలు ఉన్నాయి. ఈ మేరకు 15 మండలాల్లో 411 నీటి తొట్టెలు నిర్మాణాలకు అనుమతులు మంజూరయ్యాయి. ఒక్కొక్క తొట్టె నిర్మాణానికి రూ. 30 వేలు మంజూరు చేశారు. పనుల బాధ్యతను పంచాయతీల పరిధిలోని వ్యక్తులకు అప్పగించారు. ఇందులో వేతనంగా రూ. 5,100, సామగ్రికి రూ. 24,100 వెచ్చించాల్సి ఉంది. అయితే వేతనదారులకు పని కల్పించలేదు. గ్రామస్థాయిలోని ప్రతినిధులు నిర్మాణాలకు చర్యలు చేపట్టారు.
- ఈ నెల 9 వరకు గడువు ఉన్నా.. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన నీటి తొట్టెల పనులు పూర్తికావచ్చాయి. రహదారులకు ఆనుకొని ఉన్న చెరువులు, ట్యాంకర్లు, బోరుబావుల పరిధిలో నీటి తొట్టెల నిర్మించారు. అయితే నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. తొట్టెల్లో నీటిని నింపే బాధ్యతను స్థానిక పంచాయతీలకు అప్పగించినా.. పట్టించుకునే వారే కరువయ్యారు.
- 411 నీటి తొట్టెల నిర్మాణాలకు రూ. 1.23 కోట్లు మంజూరు చేశారు. అయితే నిర్మాణం పూర్తయినా నేటికీ నిధులు విడుదల కాలేదు. ఒకవైపు నీటి తొట్టెలు, మరోవైపు ప్రహరీల నిర్మాణాలతో పాటు పలు రకాల అభివృద్ధి పనులు ఉపాధిలోనే నిర్వహించారు. 15 మండలాల పరిధిలో 323 ప్రహరీలకు గాను సుమారు 235కు పైగా పూర్తికావచ్చాయి. రూ.2.47కోట్లు బిల్లులు మంజూరు కావల్సి ఉంది.
- మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులకు రూ.12 కోట్ల వరకు బకాయిలున్నాయి.
- వేతనదారులకు సంబంధించి 11 వారాలకు గాను 4 వారాలకు సంబంధించిన చెల్లింపులు జరిగాయి. మరో ఏడు వారాలకు గాను సుమారు రూ.20 కోట్ల పైబడి వేతనాలు అందాల్సి ఉంది.
నమోదు చేయలే..
నీటి తొట్టెల నిర్మాణాల చెల్లింపులకు సంంధించి ఎంబుక్‌లో నమోదు చేయలేదు. ప్రహరీలకు సంబంధించి ఉపాధి ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు ఇప్పటికే నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. అయితే స్లాట్ ఓపెన్ కాకపోవడంతో నిధుల కోసం ఓవైపు కాంట్రాక్టర్లు, మరోవైపు వేతనదారులు గత రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు.
పంచాయతీలదే బాధ్యత
నీటి తొట్టెల బాధ్యత స్థానిక పంచాయతీలదే. తొట్టెలకు ఆనుకుని నీరు నిల్వ లేకుంటే వేరే ప్రాంతం నుంచి నీటిని తెచ్చి తొట్టెలను నింపాల్సి ఉంది. కుళాయిలు ఉన్న ప్రాంతాల నుంచి నీటిని సరఫరా చేయాలి. అలా చేయకుంటే పంచాయతీలపై చర్యలు తప్పవు. తొట్టెల నిర్వహణ బాధ్యత ఉపాధి క్షేత్ర సహాయకులపై ఉంది. పర్యవేక్షణ కొరవడితే చర్యలు తప్పవు. వాటి నిర్మాణాలకు సంబంధించిన నిధులు వారం రోజుల్లో జమకానున్నాయి. త్వరలోనే ఉపాధి కూలీలకూ వేతనాలు చెల్లిస్తాం.
- జి.శ్రీహరిరావు, ఏపీడీ, డ్వామా, సీతంపేట క్లస్టర్
Updated Date - May 03 , 2025 | 11:14 PM