No confidence in the Vice-Chairperson వైస్‌చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం
ABN, Publish Date - Jun 11 , 2025 | 11:52 PM
No confidence in the Vice-Chairperson బొబ్బిలి మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ గొలగాని రమాదేవిపై అవిశ్వాసం నెగ్గింది. ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు ప్రిసైడింగ్ అధికారి హోదాలో బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
వైస్‌చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం
బొబ్బిలిలో చైర్మన్ బాటలోనే మద్దతు
ఈ పదవి కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో జమ
బొబ్బిలి, జూన్ 11(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ గొలగాని రమాదేవిపై అవిశ్వాసం నెగ్గింది. ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు ప్రిసైడింగ్ అధికారి హోదాలో బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ వాడపల్లి వనజాకుమారితో పాటు పలువురు ఇచ్చిన అవిశ్వాసం ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఎవరెవరు మొగ్గు చూపుతున్నారో చేతులెత్తే పద్ధతిలో తెలియజేయాలని కోరారు. సమావేశానికి హాజరైన 22 మంది సభ్యులూ అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఎవరైనా మద్దతు తెలుపుతున్నారా? అని ఆయన సమావేశంలో అడిగారు. వ్యతిరేకంగా ఓటు వేసేందుకు కౌన్సిల్‌హాలులో ఎవరూ లేకపోవడంతో వైస్‌చైర్‌పర్సన్ గొలగాని రమాదేవిపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం ప్రతిపాదన నెగ్గినట్లుగా ప్రిసైడింగ్ అఽధికారి రామ్మోహనరావు ప్రకటించారు. కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే బేబీనాయన కోఆప్షన్ సభ్యుని హోదాలో పాల్గొని అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తారు. ఆయనతో పాటు టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు, ఆ పార్టీకి చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు, వైసీపీ అసమ్మతి వర్గానికి చెందిన 11 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. వైసీపీకి చెందిన 9 మంది సమ్మతి కౌన్సిలర్లు ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు.
- గత నెల 19న మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో చేరిన సంగతి తెలిసిందే. అదే బాటలో వైస్‌చైర్‌పర్సన్ పదవి కూడా టీడీపీ ఖాతాలో జమ అయింది. వైసీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లలో ఐదుగురు గత నెలలో ఎమ్మెల్యే బేబీనాయన సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకున్న సంగతి తెలిసిందే. రెండో వైస్‌చైర్మన్‌గా ఉన్న చెలికాని మురళీకృృష్ణ ఆ పార్టీ నాయకులు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ బుధవారం నాటి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో పాల్గొనడమే కాక అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తి ఓటు వేయడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో చెలికాని వైస్‌చైర్మన్ పదవికి ఎటువంటి ముప్పు వాటిల్లబోదని అధికార తెలుగుదేశం, వైసీపీ శిబిరాల్లో బహిరంగంగా వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి.
నాపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు
పదవీ చ్యుతురాలైన వైస్‌చైర్‌పర్సన్ రమాదేవి
గతంలో తెలుగుదేశం పార్టీలో కౌన్సిలరుగా ఉన్నప్పుడు గాని, వైసీపీ హయాంలో మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు గాని తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు అయినా అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దించేశారు అని గొలగాని రమాదేవి నిరాశ వ్యక్తం చేశారు. తన పదవికి ముప్పు ఉందని తెలుసుకొని ఆమె వైసీపీ కౌన్సిలర్లతో సహా బుధవారం నాటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి హాజరుకాలేదు. తనపై అవిశ్వాసం నెగ్గిందని అధికారికంగా తెలిసిన తరువాత స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ విధంగా తనను పదవి నుంచి తప్పించడం చాలా అన్యాయమని రమాదేవి వాపోయారు.
Updated Date - Jun 11 , 2025 | 11:52 PM