ఎన్టీఆర్ వైద్య సేవలో బంధుప్రీతి
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:37 AM
ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఒక ఫార్మా కంపెనీకి చెందిన మందులనే తప్పనిసరిగా రాయాలంటూ వైద్యులపై జరుగుతున్న ఒత్తిడి వెనుక బంధుప్రీతి ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
- అందుకే ఆ కంపెనీ మందులు రాయిస్తున్నారు
- దీనికోసం వైద్యులపై ఒత్తిడి
- క్రీయాశీలక పదవిలో ఉన్న వ్యక్తే సూత్రధారి
- ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న డాక్టర్లు
విజయనగరం రింగురోడ్డు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఒక ఫార్మా కంపెనీకి చెందిన మందులనే తప్పనిసరిగా రాయాలంటూ వైద్యులపై జరుగుతున్న ఒత్తిడి వెనుక బంధుప్రీతి ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ దందాకు ఎన్టీఆర్ వైద్య సేవలో క్రియాశీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి (ఈయన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేశారు.) సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈయన దగ్గరి బంధువు ఒక డొల్ల ఫార్మాసూటికల్ కంపెనీకి చెందిన మందుల ఏజెన్సీని నడుపుతున్నట్లు సమాచారం. ఆ బంధువుకు ఆదాయం చేకూర్చలన్నా ఉద్దేశంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. దీనికోసం తన అధికారాన్ని ఉపయోగించి వైద్యులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఆయనతో పాటు బంధువు, జిల్లాకు చెందిన ఒక కీలక ప్రభుత్వ అధికారి కలసి గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆసుపత్రులను సందర్శిస్తున్నట్టు సమాచారం. డొల్ల కంపెనీ మందులను రాయాలని ఆసుపత్రి యాజమాన్యాలు, వైద్యులపై వారు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. ఎవరైనా వైద్యులు వ్యతిరేకిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ చేయాలని వైద్యులు కోరుతున్నారు. లేదంటే ఈ కుంభకోణం ఎన్టీఆర్ వైద్య సేవ విశ్వసనీయతనే దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
Updated Date - Jul 05 , 2025 | 12:37 AM