Must come at 9 o'clock 9 గంటలకు రావాల్సిందే
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:56 PM
Must come at 9 o'clock పనిచేసేచోట నివాసం ఉండకుండా.. నచ్చిన సమయానికి ఆఫీస్‌కు వెళ్లే మండల విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం చెక్ పెట్టే చర్యలకు దిగింది. కార్యాలయానికి ఖచ్చితంగా ఉదయం తొమ్మిది గంటలకే వెళ్లి ఆన్‌లైన్‌లో ముఖహాజరు వేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది
9 గంటలకు రావాల్సిందే
విధి నిర్వహణపై ఎంఈవోలకు ఆదేశం
జీపీఎస్ హాజరుతో పర్యవేక్షణ
పాఠశాలల తనిఖీలు తప్పనిసరి
కమిషనరేట్ నుంచి తాజాగా ఉత్తర్వులు
రాజాంరూరల్, జూలై 7(ఆంధ్రజ్యోతి): పనిచేసేచోట నివాసం ఉండకుండా.. నచ్చిన సమయానికి ఆఫీస్‌కు వెళ్లే మండల విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం చెక్ పెట్టే చర్యలకు దిగింది. కార్యాలయానికి ఖచ్చితంగా ఉదయం తొమ్మిది గంటలకే వెళ్లి ఆన్‌లైన్‌లో ముఖహాజరు వేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజూ తప్పనిసరిగా ఓ పాఠశాలను తనిఖీ చేయాలని చెప్పింది. ఇదే విషయాన్ని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజువీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేస్తూ ఎంఈవోలు పాటించేలా పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖాధికారులకు నిర్దేశించారు. పాఠశాలల పర్యవేక్షణ, విద్యా పథకాల అమలు, హెచ్‌ఎంలు...టీచర్ల పనితీరు పర్యవేక్షణ తదితర అంశాలు చూడడం ఎంఈవోల విధి. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎంఈవో-2ను నియమించింది. అప్పటి నుంచి జిల్లాలోని 27 మండలాల్లో 54 మంది ఎంఈవోలు పనిచేస్తున్నారు.
గాడిన పడని విద్యాశాఖ
జిల్లాలో 54 మంది విద్యాశాఖాధికారులు విధులు నిర్వహిస్తున్నా పాఠశాలల పర్యవేక్షణ గాడిన పడలేదు. మండలానికి ఇద్దరు ఎంఈవోలు ఉండడంతో కొన్ని మండలాల్లో ఆధిపత్యపోరు మొదలైంది. కొంతమంది ఎంఈవోలు మండల కేంద్రంలో నివాసం ఉండకుండా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల నుంచి రాకపోకలు సాగిస్తూ మమ అనిపిస్తున్నారు. మరికొంతమంది ఎంఆర్‌సి కేంద్రాలకు వెళ్లకుండా పాఠశాలల తనిఖీ పేరుతో కాలక్షేపం చేసే పరిస్థితి కూడా జిల్లాలో నెలకొంది. ఈ నేపధ్యంలో ఎంఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కమిషనర్‌కు ఆధారాలతో ఫిర్యాదులందాయి.
ప్రక్షాళనకు దిగిన మంత్రి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు మంత్రి నారా లోకేశ్ సైతం నడుంబిగించారు. ఫలితంగా విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు, సన్నబియ్యంతో భోజనం, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికీ రూ.13 వేలు వంతున నగదు అందజేస్తూ విద్యాప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యాశాఖ కమిషనర్ కూడా గాడిలో పెట్టే చర్యలకు దిగారు. ఎంఈవోలు మాత్రమే కాకుండా ఎంఆర్‌సీలో పనిచేస్తున్న సీఆర్పీలు, ఆపరేటర్లు, ఇతర సిబ్బంది కూడా ఉదయం తొమ్మిది గంటలకే విధులకు హాజరు కావాలని కమిషనర్ విజయరామరాజు జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
రోజూ నివేదిక..
ఉపాధ్యాయుల మాదిరిగానే ఉదయం 9.30 గంటలకు ఎంతమంది ఎంఈవోలు హాజరువేశారో జిల్లా విద్యాశాఖ ప్రతిరోజూ కమిషనరేట్‌కు నివేదిక పంపాలని కమిషనర్ ఆదేశించారు. ఎంఈవో లు ప్రతిరోజూ ఒక పాఠశాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని చెప్పారు. గతంలో కొంతమంది ఎంఈవోలు జిల్లా కేంద్రం నుంచి ఏదో ఒక సమయంలో బయలుదేరి తనకు దగ్గరలో ఉన్న పాఠశాలకు వెళ్లి తూతూ మంత్రంగా తనిఖీ చేసి హాజరైనట్లు ప్రకటించేవారు. ఈ పరిస్థితిని నివారించేందుకు తాజాగా ఎంఈవోలకు జీపీఎస్ విధానం అమలుచేస్తున్నారు. ఎంఈవో ఎమ్మార్సీ కేంద్రంలో ఉంటే అక్కడి లొకేషన్, ఏ పాఠశాలకు వెళ్తే ఆ ప్రాంత లొకేషన్ స్పష్టంగా తెలిసిపోతోంది.
కమిషనర్ ఆదేశాలు పాటించాలి
మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం
విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఎంఈవోలు తప్పనిసరిగా సమయపాలన పాటించాలి. నిర్దేశించిన సమయంలోనే ముఖ హాజరు వేయాలి. ప్రతిరోజూ ఓ పాఠశాలను తనిఖీ చేయాల్సిందే. జిల్లాలోని అందరి ఎంఈవోల హాజరు సమాచారాన్ని ప్రతిరోజూ జిల్లా విద్యాశాఖ కమిషనరేట్‌కు పంపుతుంది. ఎంఈవోలు పాఠశాల తనిఖీలకు వెళ్లినపుడు జీపీఎస్ విధానంలో అక్కడి లొకేషన్ నుంచి హాజరు వేయాలి. ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి.
-------------
Updated Date - Jul 07 , 2025 | 11:56 PM