More than a farm... animal husbandry పొలం కన్నా.. పశుపోషణే మిన్న
ABN, Publish Date - May 31 , 2025 | 11:57 PM
More than a farm... animal husbandry వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి ఒక భాగం. ఒకప్పుడు గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ పాలిచ్చే పశువులు ఉండేవి. పాలు ఇంట్లో వాడకానికి పోను మిగిలినవి ఇరుగుపొరుగు వారికి ఇచ్చేవారు. కొంతమంది గ్రామాల్లోకి వచ్చే వ్యాపారులకు అమ్మేవారు. తద్వారా కుటుంబ పోషణకు, ఇతర చిన్న అవసరాలకు సరిపడా ఆదాయం పొందేవారు.
పొలం కన్నా.. పశుపోషణే మిన్న
పిల్లల చదువులు, వివాహాలకూ ఇదే డబ్బు
ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న కొందరు రైతులు
వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి ఒక భాగం. ఒకప్పుడు గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ పాలిచ్చే పశువులు ఉండేవి. పాలు ఇంట్లో వాడకానికి పోను మిగిలినవి ఇరుగుపొరుగు వారికి ఇచ్చేవారు. కొంతమంది గ్రామాల్లోకి వచ్చే వ్యాపారులకు అమ్మేవారు. తద్వారా కుటుంబ పోషణకు, ఇతర చిన్న అవసరాలకు సరిపడా ఆదాయం పొందేవారు. ఇప్పుడు పాడి పెంపకం ఆసక్తి తగ్గిపోతోంది. గ్రామాల్లో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప్రభావం రైతుల జీవితాలపై పడింది. పంటల్లో నష్టం వచ్చినప్పుడు రైతులు అప్పులపాలు కావాల్సి వస్తోంది. అయితే కొందరు రైతులు ఇప్పటికీ పాడితో ఉపాధి పొందుతున్నారు. పిల్లలను చదివించుకుంటూ వారికి వివాహాలు కూడా చేస్తున్నారు. పాడిపెంపకం ద్వారా ఉపాధి పొందుతున్న కొందరు రైతుల గురించి కథనాలు..
- ఇది తిరుపతినాయుడుగాథ
బొబ్బిలి/రూరల్, మే 31(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన తిరుపతి నాయుడు పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. పశు సంవర్ధకశాఖ ద్వారా రుణం పొంది నాలుగు ఆవులు కొనుగోలు చేసి ప్రారంభించాడు. తనకున్న ఎకరా పొలంలో మేలు రకాల పచ్చగడ్డి పెంచుతున్నాడు. పచ్చిగడ్డి అందుబాటులో లేనప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పాతర గడ్డి తయారీ కోసం మొక్కజొన్నతో పాటు మేలు జాతి పశుగ్రాసాలు పెంచుతున్నాడు. ఇప్పుడు ఆయన వద్ద ఆరు ఆవులు ఉన్నాయి. తమ కుటుంబ సభ్యులే ఆవుల పోషణ చూసుకుంటారని తిరుపతినాయుడు చెప్పాడు. ఆవులు రెండుపూటలా 70 లీటర్ల పాలు ఇస్తాయని, లీటరు రూ.35 చొప్పున అమ్ముతున్నానని తెలిపాడు. నెలకు మొత్తం ఆదాయం రూ.75వేలు వస్తుందని, ఇందులో ఖర్చులు రూ.30వేలు పోను రూ.45వేలు మిగులుతోందని తెలిపాడు. పాడిపోషణ మొదలు పెట్టినప్పటి నుంచి ఆర్థికంగా నిలదొక్కుకున్నానని చెబుతున్నాడు.
పొలం కౌలుకు ఇచ్చి..
బొబ్బిలి మండలం రాజుపేట గ్రామంలో నివాసముంటున్న నాగిరెడ్డి విజయగౌరి గత 15 సంవత్సరాలుగా పాడి పోషణతో జీవనం సాగిస్తోంది. ‘మాకు 10 ఆవులు, 4 పడ్డలు, 4 పెయ్యిలు ఉన్నాయి. రోజుకి 50 లీటర్లు పాలు ఇస్తాయి. పాలు విశాఖడెయిరీకి పోస్తున్నాం. మాకున్న 4 ఎకరాల పొలంలో మూడు ఎకరాలు కౌలుకిచ్చేశాం. ఒక ఎకరా పొలంలో గడ్డి వేసుకున్నాం. వ్యవసాయం కన్నా ఇదే బాగుంది. పాడితోనే ఆర్ధికంగా ఉన్నత స్థితికి చేరుకుంటు న్నాం. వ్యవసాయం చేయలేక మేము ఈ బాట పట్టాం. పాలు లీటరు 35 నుంచ 40 రూపాలయలకు అమ్ముతాం. నెలకు రూ. 25 వేలు ఖర్చు అవుతుంది. ఖర్చులు పోగా రూ. 32 వేలు మిగులుతుంది’ అని విజయగౌరి తెలిపారు.
30 ఏళ్లుగా పాడిపైనే జీవనం
కురుపాం రూరల్, మే 31(ఆంధ్రజ్యోతి): సీతంపేట గ్రామానికి చెందిన గుంట్రెడ్డి పోలినాయుడు నిరుపేద రైతు. గడచిన 30 సంవత్సరాలు పాడినే నమ్ముకుని జీవిస్తు న్నాడు. తొలుత ఒక గేదెను పోషించుకుం టూ పాలను అమ్మి కుటుంబాన్ని పోషిం చుకునేవాడు. దీనిద్వారా పాడి పశువులను అభివృద్ధి చేసుకున్నాడు. ఇప్పుడు తాను స్వయంగా 50 లీటర్ల పాలను తీస్తున్నాడు. గ్రామంలో మరో 50 లీటర్లు సేకరించి మొత్తం 100 లీటర్లు కురుపాం, శివన్న పేటలో ఇంటింటికీ వెళ్లి విక్రయిస్తున్నాడు. తన ఇద్దరు కుమారులకు ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కొడుకు ప్రదీప్ హైదరాబాద్‌లో యూపీఎస్‌సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుండగా.. చిన్న కుమారుడు ప్రవీణ్ విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమారులు సెలవుల్లో వచ్చినప్పుడు ఇంటింటికి పాలు పోసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పాడి ద్వారానే తాను ఆర్థికంగా అభివృద్ధి చెందానని పోలి నాయుడు చెబుతున్నాడు.
- పాల ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఐదో స్థానంలో ఉంది. ఐదేళ్లలో ఉత్పత్తిని 15 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో సమీకృత దాణాను రైతులకు అందిస్తోంది. జిల్లాకు 500 మెట్రిక్ టన్నుల దాణా వస్తోంది. తొలి విడతగా 250 మెట్రిక్ టన్నులు చేరింది. ఒక్కొక్క రైతుకి 150 కిలోల లెక ్కన 90 రోజులు విడతలవారీగా 450 కిలోల దాణాను అందిస్తాము. ఇందుకోసం రైతులు 555 రూపాయలు చెల్లిస్తే చాలు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
-వైవీ రమణ, పశుసంవర్థక శాఖ జేడీ, విజయనగరం
నేడు ప్రపంచ పాల దినోత్సవం
విజయనగరం/రింగురోడ్డు, మే 31(ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రతిఏటా జూన్ 1న పాల దినోత్సవంగా జరుపుకుంటాము. పాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఉత్పత్తిని పెంచడంపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినం ముఖ్య ఉద్దేశం. ఐసీఎంఆర్ సూచనల మేరకు ఒక వ్యక్తికి సరైన పోషకాలు అందాలంటే రోజుకు 250 మి.లీ. పాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు విశాఖ డెయిరీ పాలసేకరణ యూనిట్లు ఏర్పాటుచేసింది. ప్రైవేటు డెయిరీలు సైతం యూనిట్లు ఏర్పాటు చేశాయి. కానీ రైతుల నుంచి ఆసక్తి అంతగా ఉండడం లేదు. దానికి కారణం పశుపోషణ భారం కావడమే. జిల్లాలో ప్రస్తుతం పాడి పశువుల సంఖ్య 2,60,695 కాగా.. సంతానోత్పత్తి సామర్థ్యం ఉన్న పశువులు 2,72,445 ఉన్నాయి. రోజుకు పాల ఉత్పత్తి 6,65,668 లీటర్లు జరుగుతుండగా.. ఇందులో డెయిరీలు సేకరిస్తున్నవి 3,71,885 లీటర్లు. స్థానికంగా వినియోగానికి 2,53,783 లీటర్లు. అయితే ఇప్పుడు నాణ్యమైన పాలు అన్నవి గగనంగా మారుతున్నాయి. పశుపోషణకు దాణా, పశుగ్రాసం దొరకని పరిస్థితి ఉంది.
Updated Date - May 31 , 2025 | 11:57 PM