TIDCO Houses టిడ్కో ఇళ్లలోనే సంక్రాంతి చేసుకునేలా చర్యలు
ABN, Publish Date - Jul 17 , 2025 | 12:01 AM
Measures to Celebrate Sankranti in TIDCO Houses Themselves టిడ్కో లబ్ధిదారులు వారి ఇళ్లలోనే వచ్చే సంక్రాంతి పండుగ చేసుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ తెలిపారు. పెండింగ్ టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామన్నారు. పట్టణంలోని చంద్రంపేట సమీపంలో ఉన్న టిడ్కో ఇళ్ల గృహ సముదాయాలను బుధవారం పరిశీలించారు.
టిడ్కో చైర్మన్ అజయ్‌కుమార్
సాలూరు, జూలై 16(ఆంద్రజ్యోతి): టిడ్కో లబ్ధిదారులు వారి ఇళ్లలోనే వచ్చే సంక్రాంతి పండుగ చేసుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ తెలిపారు. పెండింగ్ టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామన్నారు. పట్టణంలోని చంద్రంపేట సమీపంలో ఉన్న టిడ్కో ఇళ్ల గృహ సముదాయాలను బుధవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘ బ్యాంకులో లోను తీసుకున్నట్లుగా అధికారులు మాతో సంతకాలు పెట్టించుకున్నారు. దీంతో సుమారు రూ.3 లక్షలకు పైగానే ఈఎంఐల రూపంలో బ్యాంకు అధికారులు తీసుకున్నారు.’ అని లబ్ధిదారులు కనకల కనక, అర్జి సూర్యనారాయణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లలో తాము ఉండకపోయినా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన ‘తల్లికి వందనం’ పథకం వర్తించలేదని మరికొందరు వాపోయారు. అనంతరం అజయ్‌కుమార్ మాట్లాడుతూ..‘ 2014-19లో రూ. 28వేల500 కోట్లతో 4 లక్షల 52వేల టిడ్కో ఇళ్లు నిర్మించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 2లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణాలే చేపట్టింది. దీంతో ఎంతోమంది లబ్ధిదారులు నష్టపోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం 365, 430 చదరపు అడుగుల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టేందుకు ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వం డీడీల రూపంలో తప్పుడు లెక్కలు చూపించి కోట్ల రూపాయలను పక్కదారి పట్టించింది. డీడీల రూపంలో చెల్లించినవారికి తిరిగి డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. 2025, మే 30 వరకు కూడా ప్రభుత్వమే ఈఎంఐలను కడుతుంది. అన్ని రకాలుగా టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేస్తాం.’ అని ఆయన తెలిపారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, తూర్పుకాపు రాష్ట్ర చైర్మన్ యశస్వి, జనసేన పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 12:01 AM