ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Marts of change మార్పుతేని మార్టులు

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:06 AM

Marts of change పొదుపు సంఘాల మహిళల్ని వ్యాపారవేత్తలుగా చేస్తామని, వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తామని చెప్పిన గత ప్రభుత్వం వారి డబ్బులతోనే మహిళా మార్టులను ఆర్భాటంగా ప్రారంభించి వదిలేసింది. మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామంది. జిల్లాలో రెండు చోట్ల మాత్రమే ప్రారంభించింది. నిర్వహణలో ఎదురయ్యే సాదకబాధకాలను పట్టించుకోలేదు. నష్టాలు వస్తే వాటి నుంచి బయటపడే మార్గాన్ని నిర్దేశించలేదు.

గరివిడిలో ఏర్పాటు చేసిన మహిళా మార్టు

మార్పుతేని మార్టులు

తిరోగమనంలో మహిళా మార్టులు

మధ్యలోనే ఆగిపోయిన ఆన్‌లైన్‌ డిజిటల్‌ కామర్స్‌

ఆర్భాటంగా ప్రారంభించిన గత ప్రభుత్వం

నిర్వహణలో లోపాలు సరిచేయలేని వైనం

నష్టాలు భరించలేక తలలు పట్టుకుంటున్న వెలుగు సిబ్బంది

పొదుపు సంఘాల మహిళల్ని వ్యాపారవేత్తలుగా చేస్తామని, వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తామని చెప్పిన గత ప్రభుత్వం వారి డబ్బులతోనే మహిళా మార్టులను ఆర్భాటంగా ప్రారంభించి వదిలేసింది. మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామంది. జిల్లాలో రెండు చోట్ల మాత్రమే ప్రారంభించింది. నిర్వహణలో ఎదురయ్యే సాదకబాధకాలను పట్టించుకోలేదు. నష్టాలు వస్తే వాటి నుంచి బయటపడే మార్గాన్ని నిర్దేశించలేదు. కనీసం వారికి వ్యాపార మెలకువలను నేర్పలేదు. చివరకు వ్యాపారం సాగక, కనీస స్థాయిలో కొనుగోళ్లు లేక.. సరుకులు పాడై నష్టాల బాట పట్టాయి. వాటిని నిర్వహించలేక వెలుగు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

చీపురుపల్లి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి):

మండలానికొక మహిళా మార్టును నెలకొల్పుతామన్నారు. కానీ జిల్లాలో రెండుచోట్ల ఎస్‌.కోట, గరివిడిలో మాత్రమే ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఒక్కో మహిళ నుంచి రూ.300 వంతున వసూలు చేశారు. ఈ లెక్కన జిల్లాలోని 27 మండలాల నుంచి సుమారు రూ.13.39 కోట్లు వసూలైనట్టు సమాచారం. ఈ మొత్తంతో ప్రతి మండలంలో మార్టులు నెలకొల్పాల్సి ఉంది. కానీ రెండుచోట్లే ప్రారంభించారు. క్లస్టర్‌ సమన్వయకర్తల్ని ఆ మార్టులకు ఇన్‌చార్జిలుగా నియమించారు. ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న డ్వాక్రా మహిళలు, వారికి పరిచయమున్న కుటుంబాలు తమకు అవసరమైన నిత్యావసర సరుకుల్ని సమీపంలో ఉన్న మహిళా మార్టుల్లో కొనుగోలు చేయాలని అందరికీ జిల్లా స్థాయి అధికారులు వర్తమానాలు పంపించారు. అయితే అందుబాటులో ఉన్న దుకాణాలను వదిలేసి, దూరంలో ఉన్న ఈ మార్టులకు ఆటోల్లోనో, ఇతర వాహనాల్లోనో వెళ్లి సరుకులు తెచ్చుకోవడం కష్టంతో కూడుకున్న పని కావడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. అధికారులు ఊహించిన మేర వ్యాపారం జరగకపోవడంతో చివరి ప్రయత్నంగా మహిళల్ని ఒత్తిడి చేసి, బలవంతంగా కొనుగోలు చేయించారు. మండలాల్లో సేవలందిస్తున్న వీఓఏలకు కూడా సరుకుల కొనుగోలులో లక్ష్యాలను విధించారు. వారు ఏదో విధంగా మార్కెటింగ్‌ చేయకతప్ప లేదు. ఈ రకంగా మార్టుల్లో కొంత మేర వ్యాపారాలు నడిచాయి. అయితే దుకాణాలకు అద్దె చెల్లించాల్సి రావడంతో పాటు నిర్ణీత గడువు ముగిసి మురిగిపోయిన సరుకులు అధికంగా పేరుకుపోవడంతో వ్యాపారానికి భారంగా పరిణమించాయి.

ఓఎన్‌డీసీకి (ఆన్‌లైన్‌ డిజిటల్‌ కామర్స్‌) ఆదిలోనే అంతరాయం

మార్టులు నడవడం కష్టంగా మారిన పరిస్థితుల్లోనే అధికారులు ఆన్‌లైన్‌ వ్యాపారానికి కూడా తెర తీశారు. సరుకులు కావాలనుకున్న వారు ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్‌ చేయొచ్చని చెప్పి దానికొక లింక్‌ను క్రియేట్‌ చేశారు. ఆ లింక్‌ను సంబంధిత గ్రూపుల్లో పెట్టి విస్తృతంగా ప్రచారం చేశారు. ఎప్పటిలాగే ఒత్తిడి కూడా తెచ్చారు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరూ ఈ లింక్‌ను క్లిక్‌ చేసి ఏదో ఒక వస్తువుకు ఆర్డర్‌ చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో చాలా మంది సరుకుల కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్లు బుక్‌ చేశారు. గరివిడి, ఎస్‌.కోట మార్టులతో బాటు జిల్లాలో ఇత్తడి సామగ్రి తయారీలో పేరొందిన మెరకముడిదాం మండలంలోని బుదరాయవలసను కూడా చేర్చారు. ఇత్తడి సామగ్రి ప్యాక్‌ చేసే పనిని వెలుగు కార్యాలయానికి చెందిన సీసీలు, వీఓఏలు, ఇతర సిబ్బందికి అప్పగించారు. అయితే ప్యాకింగ్‌ పూర్తి చేసుకున్న సరుకులను ఆన్‌లైన్‌లో ఆర్డర్లు బుక్‌ చేసిన వినియోగదారులకు పంపించడం వెలుగు సిబ్బందికి ప్రశ్నార్థకంగా మారింది. సరుకు రవాణా ఒక ఎత్తైతే, రవాణా చార్జీలు ఎవరు భరిస్తారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది.

ధరాభారం

పప్పు దినుసులు, ఆయిల్స్‌, ఇతర నిత్యావసరాలపై సరుకుల ధరలతో బాటు రవాణా చార్జీల భారాన్ని మోపుతుండడంతో వినియోగదారులు ఆసక్తి చూపలేదు. కిలో పంచదార బహిరంగ మార్కెట్లో యాభై రూపాయలు ఉండగా రవాణా వ్యయం కలిపి వినియోగదారుడి నుంచి అదనంగా వసూలు చేశారు. ఇటువంటి కారణాల వల్ల వెలుగు ద్వారా నడిపిస్తున్న ఈ మార్టులు తిరోగమనంలో పడ్డాయి.

అవగాహన పెరగాల్సి ఉంది

మహిళలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న మార్టులవి. వీటిలో వ్యాపారం జరిగితే డ్వాక్రా మహిళలే ప్రయోజనం పొందుతారు. అందుకే ఆ మార్టుల్లో కొనుగోలు చేయాలని చెబుతున్నాం. ఈ విషయంలో మహిళలకు మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. కొనుగోలుకు ఎవరినీ ఒత్తిడి చేయలేదు. చీపురుపల్లి, ఎస్‌.కోట మార్టులు విజయవంతమైతే మరిన్ని నెలకొల్పుతాం. ఓఎన్‌డీసీ కూడా తాత్కాలికంగా ఆపేశాం. రవాణాలో ఇబ్బందులు వాస్తవమే.

- కోరాడ సావిత్రి, అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌, డీఆర్‌డీఏ, విజయనగరం.

Updated Date - Apr 26 , 2025 | 12:06 AM