Festivals Successful ఉత్సవాలను విజయవంతం చేయాలి
ABN, Publish Date - May 14 , 2025 | 11:01 PM
Making Festivals Successful సాలూరులో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న శ్యామలాంబ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన
పార్వతీపురం రూరల్, మే14(ఆంధ్రజ్యోతి): సాలూరులో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న శ్యామలాంబ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. ‘అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న పండగకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. భక్తులకు అవసరమైన తాగునీరు, ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. పారిశుధ్యంపై దృష్టి సారించాలి.పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులు నడపాలి. జిల్లాస్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయనున్నాం. వాహనాల పార్కింగ్ కోసం గుర్తించిన ఐదు స్థలాలను సిద్ధం చేసుకోవాలి. సిరిమాను తిరిగే ప్రాంతాలతో పాటు అన్ని ముఖ్య కూడళ్లలో పోలీస్ బందోబస్తుతో పాటు 30 రోప్ పార్టీలను సన్నద్ధం చేయాలి. భక్తులందరూ ఒకే ప్రాంతంలో గుంపుగా ఉండకుండా చూడాలి. సాలూరు పట్టణ రహదారుల్లో గుర్తించిన 22 గుంతలను తక్షణమే పూడ్చాలి. శిథిల గృహాలు, భవనాలకు సమీపంలో ఉన్న విద్యుత్ తీగల వద్ద ప్రజలు ఉండకుండా చూసుకోవాలి. 15 ప్రాంతాల్లో అదనంగా 50 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. వాణిజ్యవేత్తలు, ఎన్‌జీవోల సహకారంతో పలు ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. 14 వైద్య బృందాల ద్వారా 378 మంది వైద్య సిబ్బంది సేవలు అందించాలి. అంబులెన్స్‌లు, మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. దేవాలయ అలంకరణ, క్యూలైన్ల ఏర్పాటుతో పాటు భక్తులు, చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.’ అని కలెక్టర్ తెలిపారు. ‘లోఓల్టేజ్ సమస్య తలెత్తకుండా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్‌ను నిలిపివేస్తున్నాం. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరాకు అంత రాయం కలగకుండా కమిటీ సహకారంతో జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నాం.’ అని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ వెల్లడించారు.
ప్రతినెలా అనీమియా యాక్షన్ కమిటీ సమావేశం
బెలగాం: ప్రతి సచివాలయ పరిధిలో అనీమియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఇకపై ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కమిటీ సమావేశంలో తీసు కున్న చర్యలు, తద్వారా వచ్చిన ఫలితాలపై ఇక నుంచి సమీక్షిస్తామని తేల్చి చెప్పారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులు, ఇతర జిల్లా అధికారులతో సమీక్షించారు. ‘ సీతానగరం, మామిడిపల్లి, శంబర పీహెచ్‌సీల పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. జిల్లాలో మలేరియా కేసులు ఉండడానికి వీలు లేదు. ఇందుకోసం గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రతి శుక్రవారం కచ్చితంగా డ్రైడే పాటించాలి. డెలివరీ కేసులను తప్పనిసరిగా రిజిస్ర్టేషన్ చేయాలి.’ అని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు, టీబీ నియంత్రణ అధికారి వినోద్‌కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నిబద్ధతతో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర
ఈ నెల 17న స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిబద్ధతతో చేపట్టాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘బీట్ ద హీట్ ’ నినాదంతో ముందు కెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమం నిర్వహణలో ఈసారి జిల్లా మంచి ర్యాంకును సాధించాల న్నారు. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రూ.15 వేలను మంజూరు చేస్తుందన్నారు. జిల్లాలో 556 సామాజిక మరుగుదొడ్లు మంజూరు చేశామని, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి వాటి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. 80 గ్రామ పంచాయతీ భవనాలను నిర్మాణానికి స్థలాలు, నిధులును మంజూరు చేశామని, ఈ నెలా ఖరులోగా గ్రౌండింగ్ అయ్యేలా డీపీవో బాధ్యత వహించాలన్నారు. 248 గ్రామాల్లో మలేరియా గుర్తించామని, సుమారు 50 వేల మందికి రక్త పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రతి ఇంటిలో ఐఆర్‌ఎస్ స్ర్పే కార్యక్రమాన్ని జూన్ 15 వరకు నిర్వహిస్తామన్నారు. పంచాయతీల్లో స్ర్పేయింగ్, ఫాగింగ్ మెషీన్లతో పాటు క్లోరినేషన్, బ్లీచింగ్, మలాథియాన్ వంటి వాటిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గిరి చైతన్యం వాహనాలు త్వరలో రానున్నాయని తెలిపారు.
Updated Date - May 14 , 2025 | 11:01 PM