విజయవంతం చేయండి
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:51 PM
జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు.
-టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున
విజయనగరం రూరల్, జూలై 1 ( ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఇతర నాయకులతో కలిసి మంగళవారం ఆయన టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏడాది పాలన ప్రజా రంజకంగా సాగిందన్నారు. ‘సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే కొన్ని హామీలు అమలయ్యాయి. మిగతా హామీలు అమలు దశలో ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటినీ అమలు చేస్తాం. సామాజిక పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు ఇప్పటికే అమలు అయ్యాయి. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు శతశాతం అమలు కానున్నాయి.’ అని తెలిపారు. ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ.. విజయనగరం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కొండకరకాం గ్రామం నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇవి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు వీరేష్‌చంద్రదేవ్, నాయకులు ప్రసాదుల ప్రసాద్, బొద్దల నర్సింగరావు, గంటా రవి, మాతా బుజ్జి, పీతల కోదండరామ్, రాయపాటి సంతోష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 11:52 PM