మినీ అంగన్వాడీలకు మహర్దశ
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:01 AM
మినీ అంగన్వాడీ కేంద్రాలకు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాజాం రూరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మినీ అంగన్వాడీ కేంద్రాలకు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తగా పదోన్నతి కల్పించడంతో పాటు ఆయా కేంద్రాలకు ఆయాల నియామకం కూడా చేపడతామని, త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇటీవల ప్రకటించారు. తాజా పరిణామంతో ఏళ్లుగా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాకు చెల్లించే కనీస వేతనంతో నెట్టుకువస్తున్న మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి దక్కనుంది. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారను న్నాయి. జీతంతో పాటు మరిన్ని సౌకర్యాలు చేకూరనున్నాయి. కేంద్రాలకు ఆయాలను సైతం ప్రభుత్వం నియమించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో 293 మంది మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ కానున్నాయి. ఫలితంగా కార్యకర్తలకు పదోన్నతి దక్కనుంది.
జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 2206 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు కాగా, 293 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తతో పాటు ఆయా పనిచేస్తారు. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఒకరు మాత్రమే పనిచేస్తారు. మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తకు రూ.11,500, ఆయాకు రూ.7వేలు వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. వీటితో పాటు ప్రభుత్వ నియమ, నిబంధనల మేరకు కొన్ని సౌకర్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా వర్తిస్తున్నాయి. అయితే మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తకు మాత్రం ప్రభుత్వం రూ.7 వేలు వేతనంగా చెల్లిస్తోంది. వీరికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు. ఆయాకు చెల్లించే వేతనంతోనే మినీ అంగన్వాడీ కార్యకర్త కాలం వెల్లదీయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని వారంతా గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. వీరి వేదనను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తల్లో ఆనందం వెళ్లివిరుస్తోంది.
293 మంది కళ్లల్లో ఆనందం..
జిల్లాలోని 293 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. ఫలితంగా ప్రతి కేంద్రానికీ ఆయాను సైతం ప్రభుత్వం నియమించనుంది. ఫలితంగా కేంద్రాల నిర్వాహకులపై పని ఒత్తిడి తగ్గనుంది. వేతనాలు, సౌకర్యాలు పెరగనున్నాయి. ఆయాను సైతం నియమించడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల పట్ల కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేకశ్రద్ధ కనబరిచేందుకు అవకాశాలున్నాయి.
మంత్రి ప్రకటించారు..
మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు. దీంతో ఆయా కేంద్రాల కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. ప్రభుత్వం ఈ దిశగా అప్‌గ్రేడ్ చేస్తే జిల్లాలో 293 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారతాయి. ఆయా కేంద్రాలకు ఆయాల నియామకం కూడా జరుగుతుంది.
-విమలారాణి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్, విజయనగరం
Updated Date - Jul 09 , 2025 | 12:01 AM