Hopes Fulfilled ఫలించిన ఎదురుచూపులు
ABN, Publish Date - Apr 20 , 2025 | 11:42 PM
Long-Awaited Hopes Fulfilled జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆదివారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 583 ఉపాధ్యాయ పోస్టులు (137 గిరిజన ఆశ్రమ పాఠశాలలను కలుపుకొని) భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లాలో ఖాళీలు పెరగడంపై నిరుద్యోగుల్లో ఆనందం
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు
పార్వతీపురం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆదివారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 583 ఉపాధ్యాయ పోస్టులు (137 గిరిజన ఆశ్రమ పాఠశాలలను కలుపుకొని) భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఆదివారం ఉదయం పది గంటల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు. ఈనెల 20 నుంచి మే 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తును చేసేటప్పుడు అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అప్లికేషన్ తుది సమర్పణకు ముందుగా దరఖాస్తులో అడిగినవన్ని సరిగ్గా ఉన్నవి,లేనివి సరిచూచుకోవడం మంచిది. మే 20న నమూనా పరీక్ష జరగనుంది. మే 30 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు. తర్వాత ఏడు రోజుల పాటు అభ్యంతరాలు సేకరిస్తారు. దీని గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. ఫలితాలు వెల్లడించి ఆగస్టు 15లోగా అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే అవకాశముంది. కాగా కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటనపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 52 వేల మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు పోటీ పడనున్నారు. వీరిలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 18 వేల మంది, విజయనగరం జిల్లా నుంచి 34 వేల మంది వరకు అభ్యర్థులు ఉండొచ్చని ఒక అంచనా. ప్రస్తుతం అభ్యర్థులు ప్రిపేరేషన్‌పై దృష్టి సారించారు.
ఉమ్మడి జిల్లాలో ఖాళీలు ఇలా...
పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు సంబంధించి భాష-1 14 పోస్టులు, హిందీ 14 , ఆంగ్లంలో 23, గణితం 8 , భౌతిక శాస్త్రంలో 62 పోస్టులు భర్తీ చేయనున్నారు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ పీఈటీ పోస్టులు 63, ఎస్‌జీటీ 210 కలుపుకుని మొత్తంగా 446 పోస్టులు భర్తీ చేయనున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఆంగ్లం ఏడు , గణితం 25, భౌతిక శాస్త్రం 24, జీవ శాస్త్రం 16, సాంఘిక శాస్త్రంలో ఐదు పోస్టులతో పాటు ఎస్‌జీటీ 60 కలుపుకుని 137 పోస్టులు భర్తీ కానున్నాయి. స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ పోస్టులతో పాటు వివిధ గురుకులాలు, రెసిడెన్సీ, మోడల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో..
సాలూరు రూరల్: గత వైసీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆశలు కల్పించింది. కానీ ఐదేళ్ల కాలంలో ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఎన్నికలకు ముందు డీఎస్సీ ప్రకటిస్తున్నట్టు హడావుడి చేసింది. కాని ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది అమలు కాలేదు. గతేడాది ఫిబ్రవరి 12న రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల టీచర్ ఖాళీలతో మినీ డీఎస్సీని ప్రకటించారు. ఇందులో ఉమ్మడి జిల్లాలో కేవలం 284 పోస్టులను ప్రకటించారు. ఈ సంఖ్యపై అప్పట్లో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈలోగా సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో గతేడాది మార్చి 30 నుంచి జరగాల్సిన నామమాత్రపు డీఎస్సీ పరీక్షలు సైతం నిలిచిపోయాయి.
ఆనందంగా ఉంది
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్‌కు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మాలాంటి నిరుద్యోగులకు ఇదొక సువర్ణావకాశం.
- కిరణ్‌కుమార్, డీఎస్సీ అభ్యర్థి, పార్వతీపురం
==============================
మాట నిలబెట్టుకున్నారు
సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మెగా డీఎస్సీని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఉపాధ్యాయ పోస్టుల కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. ఏటా డీఎస్సీ నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- నవీన్‌కుమార్, పార్వతీపురం
==============================
హర్షణీయం..
రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయం. దీని కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల కల సాకారం కానుంది.
- కె.ఉపేంద్ర, పార్వతీపురం
==============================
చెప్పినట్టే..
ప్రభుత్వం చెప్పినట్టే మెగా డీఎస్సీని ప్రకటించడం ఆనందంగా ఉంది. గత ఐదేళ్లు ఎటువంటి డీఎస్సీ నిర్వహించక పోవడంతో నిరాశ చెందాం. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్లో ఆశలు నింపింది.
- మీసాల దివ్యమౌలిక, విశ్వనాథపురం
==============================
పెరిగిన పోస్టులు
ఉమ్మడి జిల్లా ప్రతిపాదికగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో టీచర్ పోస్టులు పెరిగాయి. దీంతో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. గతంలో కేవలం కంటితుడుపుగా ఖాళీలు చూపించారు. ప్రస్తుతం 583 ఖాళీలు చూపించడం పోస్టు దక్కే అవకాశాలు అధికమయ్యాయి.
- కనకల తిరుపతి, మామిడిపల్లి
==============================
ప్రిపరేషన్‌కు సమయం
మెగా డీఎస్సీని ప్రకటించడమే కాకుండా ప్రిపరేషన్‌కు తగిన సమయమిచ్చారు. చెప్పిన విధంగానే ఉమ్మడి జిల్లాలో పోస్టులు పెంచి మెగా డీఎస్సీని ప్రకటించడం ఆనందంగా ఉంది.
- జగ్గేన చాణక్య, మామిడిపల్లి, సాలూరు మండలం
Updated Date - Apr 20 , 2025 | 11:42 PM