ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

No Scope for Development. పర్యవేక్షణ లేక.. అభివృద్ధికి నోచక..

ABN, Publish Date - May 06 , 2025 | 11:06 PM

Lack of Supervision... No Scope for Development జిల్లాలో ప్రముఖ ఆలయాలపై దేవదాయ శాఖ పర్యవేక్షణ కొరవడింది. దీంతో వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆస్తులున్నా.. కొన్ని దేవాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.

పార్వతీపురంలో సత్యనారాయణస్వామి ఆలయం
  • దాతల సాయంతోనే ఆలయ పునర్నిర్మాణ పనులు

  • శిథిలావస్థలోనే సత్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో గదులు

  • ఆస్తులున్నా.. పట్టించుకునే వారేరీ?

  • ఉన్నతాధికారులు స్పందించాలని భక్తుల వేడుకోలు

పార్వతీపురం, మే6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రముఖ ఆలయాలపై దేవదాయ శాఖ పర్యవేక్షణ కొరవడింది. దీంతో వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆస్తులున్నా.. కొన్ని దేవాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. జిల్లాలో చినతిరుపతిగా ప్రసిద్ధి చెందిన తోటపల్లి దేవస్థానం విషయానికొస్తే.. దీనిని 1972, జనవరి 26న నిర్మించారు. ఇక్కడున్న వేంకటేశ్వర స్వామి, కోదండ రామిస్వామి దేవాలయాలు నిత్యం భక్తులతో కిటకిటలాడేవి. ఈ ప్రాంగణంలోనే వివాహాలు జరిపించేవారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు తలనీలాలు సమర్పించి.. నాగావళి నది స్నానమాచరించి స్వామిని దర్శించుకునేవారు. అనంతరం పూజలు చేసి మొక్కులు చెల్లించుకునే వారు. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన తోటపల్లి దేవస్థానంపై దేవదాయ శాఖ సీతకన్ను వేసింది. ఆలయాల నిర్వహణను పట్టించుకోవడం మానేసింది. గత రెండేళ్లుగా ఇన్‌చార్జి ఈవోతోనే నెట్టుకొస్తున్నారు. పాలకొండ కోటదుర్గమ్మ ఆలయానికి రెగ్యులర్‌ ఈవోగా ఉన్న వీవీ సూర్యనారాయణ శంబర పోలమాంబ ఆలయం, దాని పరిధిలో రెండు ఉప ఆలయాలు, తోటపల్లి దేవస్థానానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది.

దాతలే పెద్దదిక్కుగా..

తోటపల్లి దేవస్థానానికి దాతలే పెద్ద దిక్కుగా మారారు. తోటపల్లిలో ఉభయ దేవాలయాల పునర్నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం రూ.85 లక్షలు మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులేమీ కేటాయించలేదు. కానీ దాతలు మాత్రం ఇప్పటివరకు రూ.2కోట్లపైనే ఇచ్చారు. వారి సహకారంతోనే దేవాలయాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవదాయ శాఖ పూర్తిగా పట్టించుకోకపోవడంతో విరాళాలు సేకరించి.. ప్రాకర మండపం, రాజగోపురం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, వినాయక, సరస్వతిదేవి ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు అన్నదాన మండపం వంటివి నిర్మించారు.

దేవస్థానం భూములు లీజుకు..

తోటపల్లి దేవస్థానానికి చెందిన ఏడు ఎకరాల 40 సెంట్లను లీజుకు ఇవ్వడంతో ఏడాదికి రూ.36,750 ఆదాయం వస్తుంది. మరో ఐదు ఎకరాల 91 సెంట్ల భూమి ఆలయాల సమీపంలోనే ఉంది. కాగా 81 సెంట్లు తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో దేవదాయశాఖకు సొమ్ము రాకపోయినా పట్టించుకునే వారే కరువయ్యారు.

జిల్లా కేంద్రంలో ఇలా..

జిల్లా కేంద్రం పార్వతీపురంలో సత్యనారాయణస్వామి ఆలయం పరిస్థితి దయనీయంగా మారింది. దీనిపై కూడా దేవదాయ శాఖ పర్యవేక్షణ కొరవడింది. ఆ ఆలయానికి సంబంధించి సుమారు 30 ఎకరాల 27 సెంట్లు భూములు ఉన్నాయి. కొమరాడ మండలం కుమ్మరిగుంట, గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర, పార్వతీపురం పట్టణ పరిధిలోని కొత్తవలసలో భూములున్నా.. ఆలయం కనీస అభివృద్ధికి నోచుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్యనారాయణ స్వామి ఆలయ గర్భగుడి వరకు బాగానే ఉన్నా.. దాని ప్రాంగణంలోని గదులు మాత్రం పూర్తి శిథిలావస్థకు చేరాయి. అవి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా దేవదాయ శాఖ మేలుకోవాల్సి ఉంది. సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించి.. దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దేవాలయ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తుందనే అంశాలపై దృష్టి సారించి.. ప్రముఖ ఆలయాలకు పూర్వ వైభవం తేవాలని భక్తులు కోరుతున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - May 06 , 2025 | 11:06 PM