lack of money problems ఇప్పటికి గట్టెక్కుదా‘మనీ’
ABN, Publish Date - Jun 10 , 2025 | 12:37 AM
lack of money problems జూన్ వచ్చిందంటే చాలా మందికి హడలే. అందులోనూ రైతులు, పేదల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అప్పు చేయందే ఈ నెల గడవడం వారికి కష్టం. రైతులు భూములను తనఖా పెడుతున్నారు.
ఇప్పటికి గట్టెక్కుదా‘మనీ’
జూన్ మాసంలో పెరిగిన ఖర్చులు
అప్పుల బాట పట్టిన సామాన్యులు
పిల్లల చదువు, సాగు, వైద్యంపై తప్పని వ్యయం
బ్యాంకుల్లో బంగారం కుదువపెట్టి రుణాలు
- గజపతినగరం మండలానికి చెందిన రైతు అప్పలనాయుడు వర్షాలు పడడంతో వరి నారుమడి తయారు చేసుకునే పనిలో పడ్డాడు. సాగు పెట్టుబడి కోసం ఇటీవల బ్యాంకులో బంగారం కుదువ పెట్టాడు. గంపెడాశతో ఖరీఫ్ పనులు ఆరంభించాడు. పంట బాగా పండితే జనవరిలో అప్పు తీర్చేయవచ్చునని భావిస్తున్నాడు.
- విజయనగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాసరావు తన ఇద్దరు పిల్లలను ప్రయివేటు పాఠశాలల్లో చదివిస్తున్నాడు. జూన్ మాసం కావడంతో ఫీజులు, ఇతర ఖర్చుల కోసం లక్ష రూపాయలు అవసరమయ్యాయి. ఇందుకోసం భార్య బంగారు ఆభరణాలను కుదువపెట్టి రుణం తీసుకున్నాడు.
- మెంటాడకు చెందిన గురుమూర్తి ఇటీవల వడ్డీ వ్యాపారుల వద్ద కొంత డబ్బు రుణంగా తీసుకున్నాడు. ఇంట్లో అందరూ వరుసగా జ్వరాల బారిన పడడంతో ఆస్పత్రి ఖర్చు కోసం అప్పు తీసుకున్నాడు. రక్త పరీక్షలు, వైద్యం, మందుల కోసం దాదాపు రూ.20 వేల వరకూ ఖర్చు అయ్యింది. పిల్లల చదువుకు కూడా డబ్బులు అవసరం కావడంతో మరింత అప్పు చేశాడు.
విజయనగరం, జూన్ 9(ఆంధ్రజ్యోతి):
జూన్ వచ్చిందంటే చాలా మందికి హడలే. అందులోనూ రైతులు, పేదల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అప్పు చేయందే ఈ నెల గడవడం వారికి కష్టం. రైతులు భూములను తనఖా పెడుతున్నారు. చిరుద్యోగులు, వ్యాపారులు ఇంట్లో ఉన్న బంగారం కుదువపెట్టి రుణం పొందుతు న్నారు. ఏమీ లేనివారు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద అధిక వడ్డీకి రుణం తీసుకుంటున్నారు. ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. మే చివరి వారం నుంచి ఇలా బంగారం కుదువపెట్టి రుణాలు తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని బ్యాంకువర్గాలు చెబుతున్నాయి. ఏ బ్యాంకు చూసినా రుణాలు తీసుకున్న వారితో కిటకిటలాడుతున్నాయి.
తెరుచుకోనున్న పాఠశాలలు..
విద్యాసంవత్సరం ప్రారంభానికి మరో మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నెల 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పిల్లలు పాఠశాలల్లో చేరిక, వారి ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు ఒకటేమిటి అన్ని ఖర్చులు కలిసి తడిసిమోపెడే. అందుకే సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో జూన్ వస్తే ఒకటే ఆందోళన. ప్రభుత్వం తల్లికి వందనం కింద అందించే రూ.15 వేల కోసం తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చిన్నపాటి ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక తరగతులకు రూ.10 వేలు కంటే ఎక్కువగానే ఫీజులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకూ గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 వేలు, మండల కేంద్రాల్లో రూ.7,500, పట్టణాల్లో రూ.8,500గా నిర్ధారించారు. 4-5 తరగతులకు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.9 వేలు, పట్టణాల్లో రూ.10,500, జిల్లా కేంద్రంలో రూ.12 వేలు, ఆరో తరగతికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.9 వేలు, మండల కేంద్రాల్లో రూ.9,500, జిల్లా కేంద్రాల్లో రూ.11,100లను ఫీజులుగా నిర్ధారించారు. కానీ పక్కాగా అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి.
సాగుభారమే
రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు సాగు పనులు ప్రారంభించారు. వరి ఆకుమడులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దుక్కులు చేపట్టారు. కాగా రైతుకు గతం కంటే సాగుభారం పెరిగింది. సాగులో యాంత్రీకరణ వచ్చిన తరువాత పెట్టుబడులు కూడా పెరిగాయి. ఏటే ట్రాక్టర్ల దుక్కి అద్దెలు పెరుగుతున్నాయి. కూలీల వేతనం కూడా పెరుగుతోంది. దీంతో ఖరీఫ్ ప్రారంభం నుంచే పెట్టుబడులు అధికంగా ఉన్న దృష్ట్యా భారీగా నగదు అవసరం పడుతోంది. యంత్రాలు, పరికరాలకు ఎనలేని డిమాండ్ ఉండడంతో ఏడాదికేడాది అద్దెలు పెంచుకుపోతున్నారు. వ్యవసాయ కూలీల ధరలు కూడా పెరిగాయి. గతంలో ఎకరా వరి పొలం దమ్ముకు, ఉబాలుకు గుత్త రూపంలో ఇచ్చేవారు. ఇప్పుడు రేట్లు భారీగా పెంచేశారు. కాగా ప్రభుత్వం ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో ప్రోత్సాహకం జమచేయనుంది. వాటి కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పెరిగిన ఆస్పత్రి ఖర్చు
జోరువానలతో వ్యాధులు ముసురుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. దీంతో అనివార్యంగా వైద్యఖర్చులు పెరిగాయి. ఏ ఆస్పత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. సామాన్యులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నా సిబ్బంది నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. వైద్య పరీక్షలు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. జ్వరం వస్తే వైద్యులు రక్త పరీక్షలకు సిఫారసు చేస్తున్నారు. సరైన పరికరాలు లేకపోవడం, కొన్నిరకాల పరీక్షలు చేయకపోవడం, ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం వంటి కారణాలతో కొందరు ప్రైవేటు ల్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. సొంత డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఆస్పత్రుల్లో ఎక్స్‌రే, స్కానింగ్ విభాగాలు సరిగా పనిచేయడం లేదు. వెరసి పేదలు మెరుగైన వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటోంది.
------------
Updated Date - Jun 10 , 2025 | 12:37 AM