Urea యూరియా ఏదయా?
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:24 PM
Is Urea Available? ఖరీఫ్ రైతులకు అవసరమైన ఎరువులు పూర్తిస్థాయిలో అందించాలని ప్రభుత్వం ఆదేశించినా జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోంది. కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ అవి రైతుల దరి చేరడం లేదు. వాటిని పంపిణీ చేయడంలో రైతు సేవా కేంద్రం(ఆర్‌ఎస్‌కే) సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
అన్నదాతలకు పంపిణీ చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం
చోద్యం చూస్తున్న యంత్రాంగం
పాలకొండ , జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ రైతులకు అవసరమైన ఎరువులు పూర్తిస్థాయిలో అందించాలని ప్రభుత్వం ఆదేశించినా జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోంది. కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ అవి రైతుల దరి చేరడం లేదు. వాటిని పంపిణీ చేయడంలో రైతు సేవా కేంద్రం(ఆర్‌ఎస్‌కే) సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) చేరిన ఎరువులు మాత్రమే రైతులకు అందిస్తున్నారు. ఆర్‌ఎస్‌కేల్లో ఉన్న నిల్వలు మాత్రం తరగడం లేదు. ప్రస్తుతం యూరియా వినియోగం ఎక్కువగా ఉండడంతో వాటికోసం రైతులు అన్వేషిస్తున్నారు. అయితే చాలాచోట్ల యూరియా దొరక్కపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాటిని అధిక ధరలకు విక్రయించి రైతులను డీలర్లు దోచుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాకు సంబంధించి జూలై చివరి నాటికి 11,327 టన్నుల యూరియా అవసరం అవుతుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఇంతవరకు 10,084 టన్నులు జిల్లాకు చేరింది. ఇందులో 5,165 టన్నులను జిల్లాలోని 180 రైతు సేవా కేంద్రాలకు, మిగతాది పీఏసీఎస్‌లకు కేటాయించారు. మొత్తంగా ఇప్పటివరకు 6,972 టన్నులు రైతులకు పంపిణీ చేశారు. 3,112 టన్నులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, సగానికి పైగా యూరియా నిల్వలు ఆర్‌ఎస్‌కేల్లోనే ఉన్నాయి. ఒక్క పాలకొండ మండలంలోనే నాలుగు రైతు సేవా కేంద్రాల్లో యూరియా నిల్వలు పేరుకుపోయాయి. స్థానిక నాయకుల ఒత్తిడితో అంపిలి, తంపటాపల్లి ఆర్‌ఎస్‌కేల్లో రైతులకు యూరియాను పంపిణీ చేశారు. మిగిలిన లుంబూరు, జంపరకోట కేంద్రాల్లో 800 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్‌ఎస్‌కేల్లో ఎరువులను అందించకపోవడంతో రైతులు ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పాలకొండలో ఓ డీలరు యూరియా బస్తాను ఏకంగా రూ.450 విక్రయిస్తున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.
బదిలీల హడావుడిలో..
జిల్లాలోని రైతుసేవా కేంద్రాల్లో సేవలందించే విలేజ్ అగ్రిక్చలర్ అసిస్టెంట్లు(వీఏఏ) గత నెల రోజులుగా బదిలీల హడావుడిలో ఉన్నారు. ఈ సమయంలో రైతులకు ఎరువులను సరఫరా చేయడం, అధికారులకు నగదును అప్పజెప్పడం, స్టాక్ వివరాల నమోదు వంటి విషయాల్లో ఏమైనా తేడాలొస్తే ఇబ్బందులు పడతామేమోనని కొందరు వీఏఏలు ఆలోచిస్తున్నారు. అందుకే వారు రైతులకు ఎరువులను అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎరువులు కావాలని రైతులు ఎవరైనా అడిగితే సాంకేతిక పరమైన సమస్యలను సాకుగా చూపి తప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా అయితే రైతులకు ఎరువుల సరఫరా ఎలా సాధ్యమవుతుందో అధికారులకే ఎరుక. డీఏపీ, పొటాష్, సూపర్‌పాస్పైట్, కాంప్లెక్స్ ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. వాటి వినియోగం సమయం వచ్చేసరికి పంపిణీ కూడా ఇలాగే ఉంటుందేమోనని రైతులు పెదవి విరుస్తున్నారు.
పూర్తిస్థాయిలో సరఫరా
పార్వతీపురం రూరల్: రైతులకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నట్టు జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్‌పాల్ తెలిపారు. మంగళవారం పెదమరికి రైతు సేవా కేంద్రంలో రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. తమ శాఖ ద్వారా అన్నదాతలకు అన్ని సేవలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. వ్యవసాయశాఖ సలహాలు, సూచనలు పాటిం చాలని కోరారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
వీఏఏల బదిలీలతోనే జాప్యం
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో కొన్ని రైతు సేవా కేం ద్రాల్లో ఉన్న ఎరువులను సరఫరా చేయడంలో ఆలస్యమవుతుంది. రెండు మూడు రోజుల్లో వాటిని రైతులకు అందజేస్తాం..
- రత్నకుమారి, వ్యవసాయశాఖ ఏడీఏ, పాలకొండ
Updated Date - Jul 15 , 2025 | 11:24 PM