Is there any guarantee of irrigation water? సాగునీటికి భరోసా ఏదీ?
ABN, Publish Date - May 24 , 2025 | 12:12 AM
Is there any guarantee of irrigation water?
సాగునీటికి భరోసా ఏదీ?
సమీపిస్తున్న ఖరీఫ్ సీజన్
దయనీయంగా పంట కాలువలు
షట్టర్లకు మరమ్మతులు చేపట్టని వైనం
కానరాని పూడికతీత పనులు
గజపతినగరం, మే23(ఆంధ్రజ్యోతి):
ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా రైతుల్లో ఆ సన్నద్ధత లేదు. పంట కాలువల దుస్థితి చూస్తూ నిరాశ పడుతున్నారు. పంటకు తడి అందించడంలో కీలక భూమిక పోషించే కాలువలను అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. వాటిలో పూడిక తీయడం లేదు. నీటి ప్రవాహాన్ని క్రమ పద్ధతిలో పంపే షట్టర్లకు మరమ్మతులు చేయడం లేదు. దీంతో సాగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క కాలువనూ బాగుచేయలేదు. షట్ట్టర్లు దెబ్బతిని నీరు వృథాగా పోతున్నా మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించలేదు. మరోవైపు కల్వర్టులు శిథిలమైపోయాయి. నీరు విడుదల చేసినా చివరి ఎకరాకు నీరందే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించింది. కొత్త పాలకవర్గాలు వచ్చాయి. అయినా అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. పూడికతీత, గట్లు ఆధునికీకరణ, మరమ్మతులు, రక్షణ గోడల నిర్మాణాలు తదితర ఏ పనులూ చేయడం లేదు.
2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు నీటి సంఘాల కమిటీల దృష్టికి తీసుకువెళితే వారు అధికారులతో మాట్లాడి బాగు చేసేందుకు చర్యలు చేపట్టే వారు. వైసీపీ పాలనలో ఐదేళ్లూ ప్రతినిధులు లేక నీటి వనరుల స్థాయిని బట్టి డీఈ, ఈఈ, ఏఈలు అదనపు బాధ్యతలు చూసేవారు. కానీ పర్యవేక్షించే పరిస్థితి లేకపోయింది. వారికి రోజువారీ విధులే సరిపోయేవి. ఇతర సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయలేదు. ఈక్రమంలో సాగునీటి విడుదల తగ్గింపు, హెచ్చింపు, పరిశీలన, పర్యవేక్షణ, నియంత్రణ మరుగునపడ్డాయి.
గజపతినగరం, బొండపల్లి మండలాలకు సంబంధించి ఎంఎన్ చానల్, బీవీ చానల్, 13 వంతుల కాలువ, ఆండ్ర కాలువల పరిధిలో సుమారు 40వేల ఎకరాల వరకు సాగులో ఉన్నాయి. 13వంతుల కాలువ, ఎంఎన్‌చానల్ గేట్లు పూర్తిగా పాడయ్యాయి. షట్టర్లు చోరీకి గురయ్యాయి. కాలువలు పూడికలతో నిండిపోయాయి. దీంతో సాగునీరు ఎక్కడికక్కడే వృథాగా పోతోంది. వర్షాలు అనుకూలిస్తే చెరువులు నిండనున్నాయి. అయితే చెరువుల మదుములు, కల్వర్టులు సరిగా లేవు. సాగునీటి సంఘాల చైర్మన్లు కాలువలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పాలకులే చొరవ తీసుకోవాలి
ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌ల ప్రారంభంలో రైతులకు కష్టాలు తప్పడంలేదు. ఈప్రాంత రైతులకు ప్రధాన పంట వరి. సాగునీటి సంఘాల ప్రతినిధులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి కాలువల రూపు మార్చాలి.
- రాకోటి రాములు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి
Updated Date - May 24 , 2025 | 12:13 AM