బస్సుషెల్టర్ కలేనా?
ABN, Publish Date - May 25 , 2025 | 11:41 PM
అదొక మండల కేంద్రం.. నిత్యం వందలాది మంది సుదూర ప్రాంతాలకు బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. కానీ బస్సుల కోసం నిరీక్షించేందుకు కనీసం బస్సుషెల్టర్ కూడా లేని పరిస్థితి.
దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న మక్కువవాసులు
పట్టించుకోని అధికారులు
శిథిలావస్థకు చేరిన పాత బస్సుకాంప్లెక్స్
మక్కువ, మే 25(ఆంధ్రజ్యోతి): అదొక మండల కేంద్రం.. నిత్యం వందలాది మంది సుదూర ప్రాంతాలకు బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. కానీ బస్సుల కోసం నిరీక్షించేందుకు కనీసం బస్సుషెల్టర్ కూడా లేని పరిస్థితి. ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇదీ మక్కువ మండల కేంద్రంలోని పరిస్థితి. వీరికి బస్సుషెల్టర్ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. బస్సుల కోసం వాణిజ్య సముదాయాల ముందు నుంచుంటే వ్యాపారులు చీదరించుకుం టున్నారని పలువురు వాపోతున్నారు. బస్సుల కోసం నిరీక్షించి నీరసించిపో తున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానిక బైరి సాగరం చెరువు సమీపంలో బస్సు కాంప్లెక్స్ నిర్మించినప్పటికీ వినియోగంలో లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. గతంలో బస్సు కాంప్లెక్స్‌ను ఆర్టీసీ అధికారులు వాణిజ్య సముదాయాలకు లీజుకు ఇచ్చినా సక్రమంగా వినియోగంలో లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ప్రయాణికులు స్థానిక మెయిన్‌రోడ్డు జంక్షన్‌లోనే బస్సులు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు విసిగెత్తిపోతున్నారు. ప్రయాణాలు చేయాలంటే భయపడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి మండల కేంద్రం మక్కువలో బస్సుషెల్టర్ నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - May 25 , 2025 | 11:41 PM