రేషన్ పంపిణీ సక్రమంగా సాగేనా?
ABN, Publish Date - May 31 , 2025 | 12:16 AM
రేషన్ సరఫరాలో సమూల మార్పులు చేసింది కూటమి ప్రభుత్వం. జూన్ 1 నుంచి పాత పద్ధతిలోనే డిపోల వద్ద రేషన్ అందించేందుకు సిద్ధం అవుతోంది.
- రేపటి నుంచి డిపోల ద్వారా సరఫరాకు శ్రీకారం
- క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు
- పనిచేయని తూనిక, ఈ-పాస్ యంత్రాలు
- మ్యాపింగ్‌లో సాంకేతిక సమస్యలు
- ఒక రోజు మాత్రమే గడువు
- తలలు పట్టుకుంటున్న అధికారులు
రాజాం, మే 30 (ఆంధ్రజ్యోతి): రేషన్ సరఫరాలో సమూల మార్పులు చేసింది కూటమి ప్రభుత్వం. జూన్ 1 నుంచి పాత పద్ధతిలోనే డిపోల వద్ద రేషన్ అందించేందుకు సిద్ధం అవుతోంది. ఇంకా కేవలం ఒక రోజు గడువు మాత్రమే ఉంది. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూనిక, ఈ-పాస్ మిషన్లు సక్రమంగా పనిచేయడం లేదు. వాటిని పట్టుకుని డీలర్లు తహసీల్దారు కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా డిపోల వద్ద రేషన్ ఇవ్వడం కష్టమని అంటున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 1,249 రేషన్ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 5,71,358 తెలుపు రేషన్‌కార్డులు, 37,687 అంత్యోదయ అన్నయోజన కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు ప్రతినెలా 9,159 టన్నుల బియ్యాన్ని అందిస్తున్నారు. వీరికి జూన్ నుంచి పాత విధానంలోనే డిపోల వద్ద రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీలర్లు డీడీలు తీశారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం కూడా విడిపించారు. అయితే, గత ఐదేళ్లుగా మూలనపడేసిన తూకం, ఈ-పాస్ యంత్రాలు ప్రస్తుతం పని చేయడం లేదు. వాటిని డీలర్లు తహసీల్దారు కార్యాలయాలకు తీసుకొస్తున్నారు. కానీ, వాటిని బాగుచేసే సాంకేతిక సహాయకులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ-పాస్ యంత్రాలు త్రీజీ సిమ్‌తో పని చేసేవి. ఇప్పుడు 4జీ కానీ 5జీ సిమ్ అందిస్తేనే నెట్‌వర్క్ బాగావచ్చే అవకాశముంది.
ఒక్కో డీటీకి 150 డిపోల బాధ్యత..
రేషన్ డిపోల మ్యాపింగ్ కూడా సక్రమంగా జరగడం లేదు. మ్యాపింగ్ బాధ్యతను సీఎస్ డీటీలకు అప్పగించారు. జిల్లాలో 14 మంది సీఎస్ డీటీలు మాత్రమే పనిచేస్తున్నారు. రెండు మండలాలకు ఒకరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరికీ 150 డిపోల బాధ్యత అప్పగించారు. అయితే మ్యాపింగ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆధార్ సీడింగ్ వంటి విషయంలో తప్పులు దొర్లుతున్నాయి. సమయం చూస్తే కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. ఒకవైపు ఈ-పాస్, తూనిక యంత్రాలు పనిచేయకపోవడం, మరోవైపు మ్యాపింగ్ సక్రమంగా జరగకపోవడంతో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇబ్బందులను అధిగమిస్తాం..
ప్రభుత్వం జూన్ 1 నుంచి విధిగా డిపోల వద్ద రేషన్ ఇవ్వాలని ఆదేశించింది. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నా అధిగమిస్తాం. జూన్ 15 వరకూ రేషన్ విడిపించుకునే వెసులుబాటు ఉంది. చివరి లబ్ధిదారుడి వరకూ రేషన్ అందిస్తాం. రేషన్ తీసుకోలేదు అన్న మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిదే.
-బి శాంతి, పౌరసరఫరాల జిల్లా అధికారి, విజయనగరం
వృద్ధుల ఇంటికే రేషన్
డిపోలు సిద్ధం చేస్తున్న అధికారులు
విజయనగరం కలెక్టరేట్ మే 30 (ఆంధ్రజ్యోతి): రేషన్ డిపోల ద్వారా ఆదివారం నుంచి కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు డిపోల వారిగా సీఎస్ డీటీలు తనిఖీలు చేశారు. డిపోలను అలంకరణ చేసి స్థానిక ప్రజా ప్రతినిధులతో ప్రారంభించనున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు సరుకులు అందజేయనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు సరుకులు పంపిణీ చేస్తారు. డిపోల వద్ద ధరల పట్టిక కూడా ఏర్పాటు చేస్తున్నారు. 65 సంవత్సరాలు పైబడి వారికి మాత్రం ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు అందిస్తారు. ఇలాంటి రేషన్ కార్డులు జిల్లా వ్యాప్తంగా 65,912 ఉన్నాయి.
Updated Date - May 31 , 2025 | 12:16 AM