Public Health Being Neglected? ప్రజారోగ్యమంటే ఖాతరు లేదా?
ABN, Publish Date - May 28 , 2025 | 12:06 AM
Is Public Health Being Neglected? సాలూరు మున్సిపాల్టీలో కొందరు వ్యాపారులు బరితెగించారు. నిబంధనలు విరుద్ధంగా నడుచుకుంటూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తూనికల్లో మోసాలకు పాల్పడుతూ.. అపరిశుభ్ర వాతావరణంతో వ్యాపారాలు చేస్తున్నారు. యథేచ్ఛగా కుళ్లిన కోడి మాంసాన్ని విక్రయిస్తున్నారు. మంగళవారం అధికారుల తనిఖీల్లో ఈ విషయాలు బయటపడ్డాయి.
అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు
తూనికల్లో భారీ తేడాలు
అధికారుల తనిఖీల్లో బహిర్గతం
సాలూరు రూరల్, మే 27 (ఆంధ్రజ్యోతి): సాలూరు మున్సిపాల్టీలో కొందరు వ్యాపారులు బరితెగించారు. నిబంధనలు విరుద్ధంగా నడుచుకుంటూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తూనికల్లో మోసాలకు పాల్పడుతూ.. అపరిశుభ్ర వాతావరణంతో వ్యాపారాలు చేస్తున్నారు. యథేచ్ఛగా కుళ్లిన కోడి మాంసాన్ని విక్రయిస్తున్నారు. మంగళవారం అధికారుల తనిఖీల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ లావేటి బాలకృష్ణ తన సిబ్బందితో సాలూరులో మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక చికెన్ దుకాణంలో కుళ్లిన కోడి మాంసం విక్రయానికి పెట్టినట్లు గుర్తించారు. దాదాపు 16 కిలోల వరకు ఉన్న ఈ మాంసం వినియోగదారులకు అంటగట్టడానికి ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపు యాజమానికి రూ. 3వేలు జరిమానా విధించారు. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పలు చికెన్ షాపులు, వాణిజ్య దుకాణాలను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు జరపడంపై మండిపడ్డారు. వారికి రూ. 3వేలు జరిమానా విధించారు. 4 కిలోల సింగిల్ యూజ్ క్యారీ బ్యాగ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
తూనికల్లో మోసం..
పట్టణంలోని పెదమార్కెట్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విక్రయిస్తున్న చేపల దుకాణాలను శానిటరీ ఇన్‌స్పెక్టర్ పరిశీలించారు. తూనికల్లో మోసాలను గుర్తించారు. ఆయా చోట్ల కిలోకు 250 గ్రాములు తేడా రావడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సాలూరు తహసీల్దార్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. తూనికల కొలత అధికారులతో పరిశీలన చేయించాలని కోరారు. ఈ విషయాన్ని కమిషనర్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన చెప్పారు. కొవిడ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాపారులు పరిశుభ్రత పాటించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ సూచించారు. పరిశుభ్రత పరిసరాల్లో విక్రయాలు జరపాలన్నారు. కుళ్లిన మాంసం, చేపలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించరాదన్నారు. ప్రజలు సైతం జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Updated Date - May 28 , 2025 | 12:06 AM