Encroached! ఖాళీగా ఉందా.. కబ్జానే!
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:03 AM
Is It Vacant..? Encroached! డివిజన్ కేంద్రమైన పాలకొండ కబ్జా కోరల్లో చిక్కుకుంది. పట్టణంలోని ఆక్రమణలకు అంతే లేకుండాపోతుంది. ఖాళీ స్థలాలు, భూములు, కాలువలు, చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి.
విలువైన భూములు, చెరువుల్లో అక్రమ నిర్మాణాలు
పాలకొండలో రెచ్చిపోతున్న ఆక్రమణదారులు
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
పాలకొండ, జూలై 29(ఆంధ్రజ్యోతి): డివిజన్ కేంద్రమైన పాలకొండ కబ్జా కోరల్లో చిక్కుకుంది. పట్టణంలోని ఆక్రమణలకు అంతే లేకుండాపోతుంది. ఖాళీ స్థలాలు, భూములు, కాలువలు, చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్రమ నిర్మాణాలతో మరోవైపు సాగునీటి కాలువలు కూడా కుచించుకుపోతున్నాయి. దీంతో శివారు ప్రాంత భూములకు నీరందడం లేదు. అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తుం డడంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్టుగా సాగుతూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. మొత్తంగా వారి దందా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాల ఆవిర్భావం తర్వాత పాలకొండలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో కబ్జాదారుల కళ్లు విలువైన ప్రభుత్వ ఆస్తులపై పడ్డాయి. పట్టణంలో ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. అయితే దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నా చర్యలు శూన్యం. పట్టణంలో ఆక్రమణలు ఇలా..
- పట్టణంలోని వెంకంపేట, నాగవంశపువీధి, తమ్మినాయుడు విద్యా సంస్థల సమీపంలో ఉన్న డీసీఎంఎస్ స్థలాలను కొంతమంది ఆక్రమించు కున్నారు.
- స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆనుకుని ఉన్న 25 సెంట్లకు సంబంధించి లీజు పట్టా పొందిన ఓ వ్యక్తి దానిని విక్రయించగా ఆ స్థలం చేతులు మారుతుంది. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ స్థలమని అక్కడ బోర్డులు పెట్టింది. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని చదును చేసి పిల్లర్స్ వేశారు. దీంతో మరోసారి దళిత సంఘ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
- గారమ్మకాలనీలో సామాజిక భవన నిర్మాణానికి కేటాయించిన 25 సెంట్లపై కొందరి కన్ను పడింది. వైసీపీ సర్కారు హయాంలో కొందరు నకిలీ పట్టాలు సృష్టించారు. వీటిపై ఉన్నతధికారులకు ఫిర్యాదు అందకపోవడంతో ఇప్పటివరకు మిన్నకున్న కబ్జాదారులు మళ్లీ ఆ భూమిని వాటిని సొంతం చేసుకోడవడానికి పావులు కదుపుతున్నట్టు తెలిసింది.
- గతంలో సుమారు ఎకరా విస్తీర్ణంలో ఉండే పట్టణంలోని పీతలవానిబంద నేడు పది సెంట్లు కూడా లేకుండా పోయింది. వెంకటరాయుని కోనేరు గట్టుకు నలువైపులా ఆక్రమణదారులు పశువుల పాక వేశారు. తెలకలవానికోనేరు సమీపంలోని సుమారు రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి వేరే వారికి లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండు ఎకరాల్లో ఉన్న బంగారమ్మ కోనేరు ఇప్పటికీ సగం వరకు ఆక్రమణలకు గురైంది. గొడగల వీధిలో ఉన్న సుమారు 70 సెంట్ల స్థలంలో కొంతమంది వ్యక్తులు దురా క్రమణ చేసి గ్రావెల్ వేశారు. దీనిపై రెవెన్యూ వారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
సాగునీటి కాలువలు ఇలా..
- సీఎల్ నాయుడు నగర్ నుంచి వడమ వరకు పూర్తిగా తోటపల్లి ప్రధాన కాలువ ఆక్రమణలకు గురైంది. కాలువకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో శివారు ప్రాంత భూములకు సాగునీరు అందడం లేదు. ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసే సమయంలో సాగునీరు ప్రధాన రహదారులపైకి, పలు కాలనీల్లోకి చేరుతుంది.
- పట్టణం గుండా చిన్నకాపువీధి, పెదకాపువీధి, గేదెలవారివీధి, గెటాల డెప్పివీధి మీదుగా అన్నవరం వైపు వెళ్లే పోతులగెడ్డ కూడా ఆక్రమణలకు గురికావడంతో సాగునీరు సక్రమంగా సాగడం లేదు. గారమ్మకాలనీ, అన్నవరం కూడళ్లు వద్ద గెడ్డలోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
- ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వరదకాలువపై ఇరువైపులా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వరదనీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది.
కఠిన చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో ఆక్రమణలను గుర్తించి తొలగించే కార్యక్రమం చేపడం. ప్రభుత్వ స్థలాల రక్షణకు ప్రత్యే చర్యలు తీసుకుంటాం.
- సీహెచ్ రాధాకృష్ణమూర్తి, తహసీల్దార్, పాలకొండ
Updated Date - Jul 30 , 2025 | 12:03 AM