Irrigation Facility శివారు భూములకూ నీరందిస్తాం
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:55 PM
Irrigation Facility for Outskirts Farmlands Too తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని శివారు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని జల వనరులశాఖ ఎస్‌ఈ ఆర్.అప్పారావు తెలిపారు. బుధవారం పాత రెగ్యులేటర్ నుంచి ఖరీఫ్‌కు సాగునీరును విడుదల చేశారు.
ఎస్‌ఈ అప్పారావు
తోటపల్లి పాత రెగ్యులేటర్ నుంచి సాగునీరు విడుదల
గరుగుబిల్లి, జూలై 16(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని శివారు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని జల వనరులశాఖ ఎస్‌ఈ ఆర్.అప్పారావు తెలిపారు. బుధవారం పాత రెగ్యులేటర్ నుంచి ఖరీఫ్‌కు సాగునీరును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరాకు ముందుగానే కాలువల పరిధిలోని పూడికలు తొలగించాం. ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. త్వరలోనే గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ, బలిజిపేట, విజయనగరం జిల్లాలో వంగర, సంతకవిటి, శ్రీకాకుళం జిల్లాలో బూర్జ మండలంలో సుమారు 63,459 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తాం. ప్రస్తుతం రెగ్యులేటర్ పరిధిలో 40 వేల ఎకరాలకు సాగునీరందేలా చర్యలు చేపట్టాం. ఎడమ ప్రధాన కాలువ నుంచి 250 క్యూసెక్కులు, కుడి పిల్ల కాలువ నుంచి 70 క్యూసెక్కులు విడుదల చేశాం. లస్కర్ల నియమాకాల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కాలువల పరిధిలో గండ్లు పడకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తాం.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొదిలాపు విజయరత్నం, డీఈఈ వై.గనిరాజు, జేఈ రమణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 11:55 PM