ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Industries should come! పరిశ్రమలు రావాలి మరి!

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:43 PM

Industries should come! శృంగవరపుకోట మండల పరిధిలో జెఎస్‌డబ్ల్యూ అల్యూమినా (జిందాల్‌) యాజమాన్యానికి సేకరించి ఇచ్చిన భూముల్లో పరిశ్రమల స్థాపన కోసం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు పట్టుబడుతున్నారు. ఈమేరకు తాటిపూడి రోడ్డుకు ఆనుకుని ఉన్న జిందాల్‌ తాత్కాలిక కార్యాలయం వద్ద రెండు రోజుల నుంచి పలువురు భూ నిర్వాసితులతో కలసి ఆందోళన చేస్తున్నారు.

ఎస్‌.కోట మండలం జిందాల్‌ తాత్కాలిక కార్యాలయం వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం కూటమి నేతల ఆధ్వర్యంలో ఆందోళన

పరిశ్రమలు రావాలి మరి!

జిందాల్‌ భూముల్లో ఏర్పాటుకు కూటమి నేతల పట్టు

మద్దతు ఇస్తున్న లోక్‌సత్తా

ఎంఎస్‌ఎంఈ పార్కులు నెలకొల్పాలని డిమాండ్‌

రెండు వర్గాలుగా నిర్వాసితులు

వారికి నచ్చజెబుతున్న నాయకులు

నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని భరోసా

శృంగవరపుకోట, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి):

పరిశ్రమలతోనే అభివృద్ధి

జిందాల్‌కు సేకరించి ఇచ్చిన భూములు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో పరిశ్రమలు స్థాపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు స్థాపిస్తామని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇక్కడ స్థలాలను అందుకే చదును చేస్తున్నారు. పనులను అడ్డుకోవద్దు.

- రాయవరపు చంద్రశేఖర్‌, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి

అడ్డుకోవద్దు

జిందాల్‌ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది. దీనిని స్వాగతించాలి. కొంత మంది అడ్డుకొనేందుకు చూడడం ఇబ్బందికరం. తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి నీటిని ఇవ్వొద్దనడం సరికాదు. ఈ పరిశ్రమలకు నీటి వాడకం తక్కువ. ఈ ప్రాంత పొలాలకు సాగునీరు తగ్గుతుందనడం అపోహ మాత్రమే.

- సీహెచ్‌ఆర్‌కె ప్రసాద్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు

నిర్వాసితులకు ప్యాకేజీ అమలు చేయాలి

జిందాల్‌ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. జిందాల్‌ భూసేకరణలో అవకతవకలపైనా పోరాడుతున్నాం. ఆధారాలతో బయటపెట్టాం. పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. గతంలో యాజమాన్యం ప్రకటించిన ప్రతి ప్యాకేజీ నిర్వాసితులకు అమలు చేయాలి.

- భీశెట్టి బాబ్జీ, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు

శృంగవరపుకోట మండల పరిధిలో జెఎస్‌డబ్ల్యూ అల్యూమినా (జిందాల్‌) యాజమాన్యానికి సేకరించి ఇచ్చిన భూముల్లో పరిశ్రమల స్థాపన కోసం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు పట్టుబడుతున్నారు. ఈమేరకు తాటిపూడి రోడ్డుకు ఆనుకుని ఉన్న జిందాల్‌ తాత్కాలిక కార్యాలయం వద్ద రెండు రోజుల నుంచి పలువురు భూ నిర్వాసితులతో కలసి ఆందోళన చేస్తున్నారు. తాజాగా సోమవారం లోక్‌సత్తా పార్టీ కూడా వీరికి మద్దతు ఇచ్చింది. మరోవైపు ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం మేరకు జిందాల్‌ యాజమాన్యం స్థలాన్ని చదును చేయిస్తోంది. ఈ పనులను భూనిర్వాసితుల్లో కొందరు రైతులు అడ్డుకుంటున్నారు. భూమిలిచ్చాక ఐదేళ్లలోపు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే చట్ట ప్రకారం భూములు తిరిగి రైతులకు చెందుతాయని, జిందాల్‌ యాజమాన్యం ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదనేది వీరి వాదన. ఈ విధంగా నిర్వాసితులు రెండు వర్గాలుగా విడిపోయారు. అయితే నేతలు అందరికీ నచ్చచెబుతున్నారు. పరిశ్రమలు వస్తేనే ఈ ప్రాంతం బాగుంటుందని, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని భరోసా ఇస్తున్నారు.

నిర్వాసితులకు భరోసా

జిందాల్‌ యాజమాన్యానికి అప్పట్లో భూములు అప్పగించేందుకు ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు సహకరించారు. ఇప్పుడు రైతుల్లో కొందరు నిర్వాసితులు ఇతన్ని నిలదీస్తుండడంతో వీరి తరుపున అధికారులు జిందాల్‌ యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకువెళ్తున్నారు. అయినా గాని యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో నిర్వాసితులు భూముల్లో పనులు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. యాజమాన్యం భూముల చదును చేస్తుండడాన్ని అడ్డుకోనేందుకు అదివారం సీపీఎం, రైతు అదివాసీ సంఘ నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, చల్లా జగన్‌, తమ్మి అప్పలరాజుదొర ఆధ్వర్యంలో జిందాల్‌ భూముల్లోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. వారిని పోలీస్‌లు నిలువరించడంతో రోడ్డుపైనే భైఠాయించారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పోలీస్‌ల తీరును తప్పుపట్టారు. భూనిర్వాసితుల సమస్యను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టిలో పెడతానని పేర్కొన్నారు. ఇదే సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు మరి కొంతమంది నిర్వాసితులతో కలసి కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. పరిశ్రమలు కావాలంటూ నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే హామీ

జిందాల్‌ భూనిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్‌తో చర్చిస్తానని శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి హామీ ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుతో వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఇప్పటికే ఆమె వివరించిన సంగతి తెలిసిందే.

జిందాల్‌ చెప్పిందిలా..

అల్యూమినియం శుద్ధి కర్మాగారం(రిఫైనరీ, విద్యుత్‌ పవర్‌ ప్లాంట్‌) నిర్మాణం చేపడతామని జిందాల్‌ యాజమాన్యం చెప్పింది. ఒడిశా, చత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, కర్నాటక రాష్ట్రాల్లో ఇటువంటి కర్మాగారాలు పనిచేస్తున్నాయని వివరించింది. ఈ పరిశ్రమతో పరిసర గ్రామాల అభివృద్ధితో పాటు చెప్పుకోదగ్గ ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెండుగా లభ్యమవుతాయన్నది. కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన పర్యావరణ ప్రజా సదస్సులోనూ ఇదే విషయాన్ని వెల్లడించింది. తాటిపూడి, రైవాడ రిజర్వాయర్‌లు దగ్గరగా ఉన్నప్పటికీ ఈ పరిశ్రమకు కావాల్సిన 8 ఎంజీడి నీటిని గోదావరి ఇండస్టీయల్‌ వాటా నుంచి ఇచ్చేందుకు జీవీఎంసీ అంగీకరించిందని పరిశ్రమ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు, సెస్సు రూపంలో ఆదాయం, రవాణా ద్వారా ఆదాయం, స్థానిక కాంట్రాక్టర్లకు, కార్మికులకు, అనుబంధ నిర్మాణ కార్మికులకు ప్రయోజనాలు చేకూరుతాయని నమ్మబలికారు. వైద్య, విద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అత్యుత్తమ పునరావాస పథకం (రీహెబిలిటేషన్‌), రీ సెటల్‌మెంట్‌, (ఆర్‌ఆర్‌ప్యాకేజీ), ఉచితంగా షేర్లు ఇచ్చేందుకు నిశ్చయించారు.

17 ఏళ్లు అయినా..

జిందాల్‌ యాజమాన్యం నిర్వాసిత రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ముందుకు రావడంతో చీడిపాలెం, చినఖండేపల్లి, కిల్తంపాలెం, మూలబొడ్డవర, ముషిడిపల్లి గ్రామాల పరిధిలోని 1166.43 ఎకరాలను అధికారులు సేకరించి ఇచ్చారు. దాదాపు 400 మంది రైతులు ఈ విధంగా భూములు కోల్పోయారు. పరిశ్రమలో ఉద్యోగాలు లభిస్తాయని ఆశించారు. పదిహేడు సంవత్సరాలు గడిచింది. పరిశ్రమ నిర్మాణం మాత్రం జరగలేదు. ఇంతవరకు ఉద్యోగాలు లేవు. అభివృద్ధి లేదు.

పారిశ్రామికీకరణ దిశగా..

కూటమి ప్రభుత్వం పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా చిన్న, సూక్ష్మ, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పార్కులు స్థాపించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇన్నాళ్లుగా ఖాళీగా వున్న ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని జిందాల్‌ యాజమాన్యం కూడా ముందుకు వచ్చింది. అయితే పరిశ్రమ నిర్మించకుండా ఇన్నాళ్లు కాలయాపన చేసిన యాజమాన్యం భూములపై హక్కులు కోల్పోయిందని, తిరిగి భూములు ఇచ్చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కొందరు నిర్వాసితులు ఆందోళనకు దిగుతుండడం కూటమి నేతలకు రుచించలేదు. ఖాళీ భూముల్లో పరిశ్రమల నిర్మాణం జరిగితే ఈ నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి కలుగుతుందని భావిస్తున్నారు. భూనిర్వాసితులకు నచ్చజెబుతున్నారు. దీంతో కొంత మంది భూ నిర్వాసితులు కూటమి నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రతికూలంగా, మరి కొంతమంది అనుకూలంగా పోరాటం చేస్తుండడంతో ఎప్పుడేమి జరుగుతుందోనని చుట్టుపక్కల ప్రజలు టెన్షన్‌ పడుతున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:43 PM