గ్రామసభలు పెట్టిస్తా.. మీ సమస్యలు పరిష్కరిస్తా
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:54 PM
‘జిల్లా కలెక్టర్‌ను మీ గ్రామాలకు రప్పిస్తా. గ్రామసభలు పెట్టించి మీ సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తా.’అని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి జిందాల్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.
- ‘జిందాల్’ నిర్వాసితులకు ఎమ్మెల్యే లలితకుమారి హామీ
- మీ పోరాటాన్ని ముందుండి నడిపిస్తా: ఎమ్మెల్సీ రఘురాజు
- హైవేపై ఆరు గంటల పాటు బైఠాయింపు
శృంగవరపుకోట రూరల్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ‘జిల్లా కలెక్టర్‌ను మీ గ్రామాలకు రప్పిస్తా. గ్రామసభలు పెట్టించి మీ సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తా.’అని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి జిందాల్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. ఒకపక్క తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం, రైతు, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో జిందాల్ నిర్వాసితులు జాతీయ రహదారిపై ఆదివారం బైఠాయించగా.. మరోపక్క తమ ప్రాంతంలో వెంటనే పరిశ్రమలు రావాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువత జిందాల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లలితకుమారి ఇరువర్గాల వద్దకు వెళ్లి మాట్లాడారు. వారం రోజుల్లో కలెక్టర్‌తో చర్చించి జిందాల్ నిర్వాసిత గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్.కోట మండలంలో ఉన్న జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు అయితే వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. అలాగే, ఎమ్మెల్సీ రఘురాజు కూడా జిందాల్ నిర్వాసితులతో మాట్లాడారు. న్యాయపరంగా, శాంతియుతంగా పోరాటం చేస్తున్న జిందాల్ నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడం, వారిని గంటల తరబడి హైవేపై కట్టడి చేయడం బాధాకరమన్నారు. ఇకనుంచి నిర్వాసితుల పోరాటాన్ని తాను ముందుండి నడిపిస్తానని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సీపీఎం నాయకుడు తమ్మినేని సూర్యనారాయణ, ఆదివాసి సంఘ నేత అప్పలరాజుదొర, రైతుసంఘం నేత చల్లా జగన్ మాట్లాడుతూ.. జిందాల్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. జిందాల్ బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరరావు, ఎస్.కోట సర్పంచ్ గనివాడ సంతోష్‌కుమారి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:54 PM