అవిశ్వాసంపై ఎలా ముందుకు?
ABN, Publish Date - Apr 01 , 2025 | 11:50 PM
How to proceed with infidelity? బొబ్బిలి మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే దిశగా జరుగుతున్న పరిణామాల్లో కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి.
అవిశ్వాసంపై ఎలా ముందుకు?
మున్సిపల్ చట్టాన్ని లోతుగా పరిశీలిస్తున్న ఇరుపార్టీలు
మల్లగుల్లాలు పడుతున్న నాయకులు
ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే అధికారాలపైనా ఆరా
నిపుణులను సంప్రదిస్తున్న వైనం
నేడు కలెక్టర్‌ను టీడీపీ కౌన్సిలర్లు కలిసే అవకాశం
బొబ్బిలి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే దిశగా జరుగుతున్న పరిణామాల్లో కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. అవిశ్వాసంపై ఎలా ముందుకు వెళ్లాలి? నిబంధనలేంటి? వైసీపీని పూర్తిగా కట్టడి చేయాలంటే ఏం చేయాలి అన్న వివరాలపై టీడీపీ కౌన్సిలర్లు, వైసీపీ అసంతృప్తులు, కీలక నాయకులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ చట్టం.. నిబంధనలను లోతుగా తెలుసుకుంటున్నారు. అటు వైసీపీ నాయకులు కూడా రంగంలోకి దిగారు. నిపుణులు, న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. అవిశ్వాసం నుంచి గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
బొబ్బిలి మున్సిపాలిటీలో 31 వార్డులుండగా చైర్మన్, ఇద్దరు వైస్‌చైర్మన్లు ఉన్నారు. వీరిలో 21వ వార్డు కౌన్సిలర్ మరిశర్ల రామారావు వైసీపీ తరపున ఎన్నికైనప్పటికీ అధిష్టానం తీరుతెన్నులు నచ్చక పదవికి, వైసీపీకి గత ఏడాది రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసు ఇచ్చేందుకు ఎంతమంది కౌన్సిలర్లు సంతకాలు చేయాలి? ఆ తరువాత కౌన్సిల్ సమావేశం నిర్వహించినప్పుడు కోరమ్ సంఖ్య ఎంత ఉండాలనేదానిపై టీడీపీ కౌన్సిలర్లు స్పష్టతకు వస్తున్నారు. మున్సిపల్ చట్టంలో సెక్షన్ 46 ప్రకారం ఓటు హక్క కలిగి ఉన్న మొత్తం కౌన్సిల్ సభ్యులలో సగం మందికి తక్కువ కాకుండా సభ్యుల చేత సంతకాలు చేయాలని, నిర్ణీత ప్రొఫార్మాలో ప్రతిపాదించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చని స్పష్టంగా ఉంది. చట్టంలోని అంశాలకు ఒక్కోపార్టీ వారు ఒక్కో రకంగా భాష్యం చెప్పుకుంటున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సమావేశాన్ని నిర్వహిస్తే మొత్తం సభ్యులలో రెండువంతుల మంది ఉండాలని కొందరు, సగానికి పైగా ఉంటే చాలని ఇంకొందరు వాదిస్తున్నారు. కోరమ్ సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడానికి ఎక్స్ అఫీషియో సభ్యుడైన శాసనసభ్యుని హాజరు పరిగణించవచ్చా? లేదా? అంటే వైసీపీ కాదు అంటున్నారు. తెలుగుదేశం వారు అవునంటున్నారు. చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియోసభ్యుని హోదాలో సమావేశానికి వస్తే ఆయనను కోరమ్ సంఖ్యలో కలపవచ్చని టీడీపీ పేర్కొంటోంది.
- బొబ్బిలిలో 31 వార్డులకు గాను 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో వైసీపీకి 20 మంది, తెలుగుదేశం పార్టీకి పది మంది చొప్పున ఉన్నారు. వైసీపీ నుంచి 20 మందిలో పదిమంది తిరుగుబావుటా ఎగురవేశారు. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు ముందుగా సంతకాలు చేశారు. వీరికి పదిమంది టీడీపీ కౌన్సిలర్లు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు (ఎమ్మెల్యే) జత కలిశారు. మొత్తంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతున్న వారి సంఖ్య 21కి చేరింది. ఈ విధంగా చైర్మన్‌కు అనుకూలంగా పది మంది, వ్యతిరేకంగా 21 మంది ఉన్నారు.
- ప్రత్యర్థి శిబిరంలో రెండు పార్టీలకు చెందిన 20 మంది కౌన్సిలర్లు, ఒక ఎమ్మెల్యే ఉండడంతో వైసీపీ రహస్య శిబిరం నిర్వహణకు వెనుకడుగు వేసినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే శంబంగి సమక్షంలో ప్రస్తుతం ఉన్న పదిమంది సమ్మతి కౌన్సిలర్లు పక్కాగా మాటిచ్చారని, వైసీపీనీ వీడేది లేదని చెప్పడంతో రహస్య శిబిరానికి తరలివెళ్లకుండా మిన్నకుండి పోయినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. కలెక్టరుకు అవిశ్వాస తీర్మానం నోటీసును బుధవారం అందజేయనున్నట్లు తెలిసింది.
---------------
Updated Date - Apr 01 , 2025 | 11:50 PM