Construction material prices soar: ఇళ్లు కట్టేదెలా?
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:50 AM
Construction material prices soar: నిర్మాణ రంగానికి ఎంతో అవసరమైన సిమెంట్, ఐరన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
- నిర్మాణ సామగ్రి ధరలు పైపైకి
-బస్తా సిమెంట్ రూ.350
- టన్ను ఐరన్ రూ.53,500
- నిర్మాణదారులపై భారం
విజయనగరం ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): నిర్మాణ రంగానికి ఎంతో అవసరమైన సిమెంట్, ఐరన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో బస్తా సిమెంట్ రూ.350, టన్ను ఐరన్ రూ.53,500 పలుకుతోంది. దీంతో నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపట్టేదని మదనపడుతున్నారు. ఈ ఏడాది జనవరి తొలి వారంలో 53 గ్రేడ్ సిమెంట్ బస్తా ధర రూ.270 నుంచి రూ.280 వరకు ఉండేది. ఫిబ్రవరిలో రూ.300కు పెరిగింది. ప్రస్తుతం రూ.320 నుంచి రూ.350 వరకూ పలుకుతోంది. విజయవాడ, హైదరాబాద్‌తో పాటు ఒడిశా నుంచి జిల్లాలోని హోల్‌సేల్ షాపులకు సిమెంట్ వస్తుంది. ఇక్కడి నుంచి రిటైల్‌గా అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా 200 షాపులకు పైగా ఉన్నాయి. ప్రతిరోజూ వందలాది బస్తాలు విక్రయాలు జరుగుతుంటాయి. అదే విధంగా టన్ను స్టీల్ ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.53,500ఉంది. విజయనగరంలోని ప్రస్తుతం నాలుగైదు కంపెనీలకు సంబంధించిన స్టీల్ అందుబాటులో ఉంది. ఆయా కంపెనీల బట్టి ధరలో కూడా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వ్యత్యాసం ఉంటుంది. ఏ కంపెనీ అయినా టన్ను రూ.52 వేలు పైమాటే. ఒక ప్రముఖ కంపెనీకి సంబంధించిన స్టీల్ మాత్రం టన్ను రూ.53,500 పలుకుతోంది. జిల్లాలో ప్రస్తుతం పల్లె పండగ పథకంలో సిమెంట్ రహదారులు, కాలువల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిన పేదల ఇళ్లు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం అదనపు సాయం ప్రకటించింది. ఈ తరుణంలో సిమెంటు, ఐరన్ రేట్లు పెరగడంతో లబ్ధిదారులపై పెనుభారం పడింది. రానున్న రోజుల్లో నిర్మాణాలు మందగించనున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటి ధరలను అదుపులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.
సిమ్మెంట్ ధర పెరుగుతూ వస్తున్నది
ఇంటి నిర్మాణాన్ని సంక్రాంతి తరువాత మేము ప్రారంభించాం. అప్పుడు సిమెంట్ బస్తా రూ.275 నుంచి రూ.280 ఉండేది. ఇప్పుడు రూ.350కి పెరిగింది. స్టీల్ టన్ను రూ.53,500 ఉంది. ఇసుక మాత్రం ఉచితంగా లభిస్తుంది. రవాణా చార్జీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇసుక లభ్యత ఉన్నా, సిమెంట్, స్టీల్ ధరలు పెరగడంతో ఇంటి నిర్మాణం ఆపేశాం.
- సీహెచ్ గౌరీ, విజయగనరం
Updated Date - Apr 20 , 2025 | 12:50 AM