How many more days ఇంకెన్ని రోజులో..
ABN, Publish Date - Apr 08 , 2025 | 11:32 PM
How many more days పార్వతీపురం పురపాలక సంఘంలో కొంతమంది వైసీపీ కౌన్సిలర్ల పరిస్థితి దయనీయంగా మారింది. పైకి చెప్పుకోలేక.. లోలోన తీవ్రంగా మథనపడుతున్నారు.
ప్రజలు, కుటుంబాలకు దూరంగా ఉంటున్న వైనం
అవిశ్వాసం మరింత జాప్యమయ్యే అవకాశం
అంతవరకు వారు వైసీపీ శిబిరంలో ఉండాల్సిందేనా?
పార్వతీపురం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పురపాలక సంఘంలో కొంతమంది వైసీపీ కౌన్సిలర్ల పరిస్థితి దయనీయంగా మారింది. పైకి చెప్పుకోలేక.. లోలోన తీవ్రంగా మథనపడుతున్నారు. వాస్తవంగా టీడీపీ శ్రేణులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన తర్వాత మున్సిపాల్టీలో రాజకీయం వేడెక్కింది. మరోవైపు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి పలువురు వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో వైసీపీ క్యాంపు శిబిరానికి తెరతీసింది. మిగిలిన వైసీపీ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో పడింది. ఈ మేరకు కొంతమంది కౌన్సిలర్లతో కొద్దిరోజులుగా రాజకీయ క్యాంపు శిబిరం నిర్వహిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా సదరు వైసీపీ కౌన్సిలర్లు ఇంకెన్ని రోజులు ఇలా కుటుంబాలు, ప్రజలకు దూరంగా ఉండాలో తెలియని పరిస్థితి నెలకొంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఈ తంతు మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా సొంత పార్టీ కౌన్సిలర్లపై అంత నమ్మకం లేదా? అవిశ్వాసానికి జడిసి వైసీపీ ఇంకెన్ని రోజులు క్యాంపు రాజకీయం చేస్తోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మరికొంతమంది టీడీపీలోకి...
వైసీపీ క్యాంప్ శిబిరంలో ఉన్న ఐదుగురు కౌన్సిలర్లు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తామెప్పుడు జిల్లా కేంద్రంలో అడుగు పెడతామా? అన్న ఆలోచనలతో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే పార్వతీపురం పురపాలక సంఘంలో వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే పురపాలక సంఘంలో టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య ఇండిపెండెంట్ మద్దతుదారులతో పాటు వైసీపీ నుంచి చేరిన వారితో 18కి పెరిగింది. మరో ఐదుగురు చేరితే కౌన్సిలర్ సంఖ్య 23కు చేరుతుంది. దీంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఎప్పుడు జరిగినా కూటమి పార్టీలు చైర్‌పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Updated Date - Apr 08 , 2025 | 11:32 PM