ఇదేం తీరు?
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:58 PM
విజయనగరంలోని జేఎన్‌టీయూ మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది.
- పాత సివిల్ కాంట్రాక్టర్‌ని కాదని కొత్తవారికి పనుల అప్పగింత
- నిబంధనల మేరకు టెండర్ పొందిన వ్యక్తికి మొండిచేయి
- జేఎన్‌టీయూ మరో వివాదస్పద నిర్ణయం
-వర్సిటీ అధికారుల తీరుపై విమర్శలు
విజయనగరం రూరల్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని జేఎన్‌టీయూ మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. గత 12 ఏళ్లుగా కళాశాలలో వివిధ సివిల్ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌ను కాదని, నిబంధనలకు వ్యతిరేకంగా కొత్త కాంట్రాక్టర్లను రంగంలోకి దింపింది. వారికే సివిల్ పనులు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జేఎన్‌టీయూలో సివిల్ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. అయితే, ఈ నిబంధనలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో టెండర్ పొందిన పాత కాంట్రాక్టర్‌ను కాదని, ఈ ఏడాది సివిల్ పనుల కాంట్రాక్ట్‌ను కొత్తవారికి ఇచ్చేందుకు జేఎన్‌టీయూ అధికారులు నిర్ణయించారు. అదేంటని అడిగితే ఇది కమిటీ నిర్ణయమని చెబుతున్నారు. త్రీమ్యాన్ కమిటీలో వీసీ, రిజిస్టార్, ఈఈలు ఉన్నారు. ఆన్‌లైన్ టెండర్ ఖరారు చేసి, డాక్యుమెంట్లు సమర్పించిన తరువాత సదరు కాంట్రాక్టర్‌ని తొలగించే అధికారం కమిటీకి ఉందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పాత కాంట్రాక్టరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచా రం. ఈ విషయమై విశ్వవిద్యాలయం ఈఈ వేణుగోపాలరాజుని వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు.
వరుస వివాదాలు..
ప్రస్తుతం విశ్వవిద్యాలయానికి రెగ్యులర్ వీసీ లేరు. ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి కొనసాగుతున్నారు. అయితే, జేఎన్‌టీయూ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదస్పదమవుతున్నాయి. గతంలో ఒక సీనియర్ అధ్యాపకుడు బాబులును విజయ నగరం నుంచి కాకినాడకు ఆకస్మికంగా బదిలీ చేశారు. ఇది వివాదస్పదం కావడంతో తిరిగి బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నారు. అంతకముందు కళాశాలలో ఔట్ సోర్సింగు ఉద్యోగుల పదోన్నతులు, వారి జీతాలు పెంపు తదితర విషయాలు కూడా వివాదాస్పదమయ్యాయి.
Updated Date - Jun 22 , 2025 | 11:58 PM