గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి
ABN, Publish Date - Jul 24 , 2025 | 11:37 PM
జిల్లాలో పీఎం జన్మన్ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలు మరింత వేగవంతం కావాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం/కురుపాం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం జన్మన్ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలు మరింత వేగవంతం కావాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో ఆయన గురువారం పర్యటించారు. పీఎం జన్మన్‌లో మంజూరైన గృహ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పీఎం జన్మన్ కింద ఐదు వేల గృహాలు మంజూరైనట్లు తెలిపారు. వీటిలో 1600 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, 130 వరకు ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిని డిసెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం జన్మన్ పథకం కింద ఒక్కో ఇంటికి రూ.2.39లక్షలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం భద్రగిరి సీహెచ్‌సీ నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తిచేసి భవనాన్ని సిద్ధం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు వంటివి ప్రబలుతున్నాయని, ఇటువంటి తరుణంలో పాత భవనంలో రోగులకు బెడ్స్ సరిపోవని, త్వరగా కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కన్నయ్యగూడ అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం మరమ్మతులకు, పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణానికి, నిర్వహణ కోసం నిధులు మంజూరు చేస్తామని అన్నారు. కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఆర్.కృష్ణవేణి, కురుపాం ఎంపీడీవో ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 11:37 PM