Hopes for merging విలీనంపై ఆశలు
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:07 AM
Hopes for merging శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు ఈ ప్రాంతీయులు విలీనాన్ని బలంగా కోరుకున్నారు. అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చిన చంద్రబాబు విలీనం విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలను పరిశీలించడానికి ప్రభుత్వం తాజాగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఎస్.కోట వాసులకు విలీనంపై ఆశలు చిగురించాయి.
విలీనంపై ఆశలు
విశాఖ జిల్లాలో ఎస్.కోట కలపాలని డిమాండ్
మరోసారి తెరపైకి జిల్లాల పునర్విభజన అంశం
గత వైసీపీ ప్రభుత్వంలో శృంగవరపుకోటకు అన్యాయం
న్యాయం చేస్తామని ఎన్నికల్లో మాటిచ్చిన చంద్రబాబు
శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు ఈ ప్రాంతీయులు విలీనాన్ని బలంగా కోరుకున్నారు. అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చిన చంద్రబాబు విలీనం విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలను పరిశీలించడానికి ప్రభుత్వం తాజాగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఎస్.కోట వాసులకు విలీనంపై ఆశలు చిగురించాయి.
- శృంగవరపుకోట నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాకు దగ్గరగా ఉంది. వాణిజ్య, వ్యాపార పరంగాను ఈ ప్రాంత వాసులు విశాఖ వైపే చూస్తారు. జిల్లాల పునర్విభజన సమయంలో దీన్ని విశాఖలో విలీనం చేస్తే అన్ని విధాలా అభివృద్ధి చెందేది. విశాఖలో కలపాలని ఇక్కడి ప్రజలు పెద్ద ఉద్యమం చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని సరిచేస్తాను. విశాఖ మహానగరంతో సమానంగా ఎస్.కోటను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాను.
- శృంగవరపుకోటలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది.
శృంగవరపుకోట జూలై 26(ఆంధ్రజ్యోతి):
జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాల పేర్ల మార్పు, డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులపై ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని తాజాగా ఏర్పాటు చేసింది. దీనికి ఏడుగురు మంత్రులను నియమించింది. పరిపాలనా సౌలభ్యం, వాస్తవిక పరిస్థితులు, చారిత్రక, భౌగోళిక, ఆయా ప్రాంతాల మధ్య ఆర్థిక, సామాజిక సమతుల్యతను పెంపొందించేలా జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోవాలని మంత్రుల కమిటీకి ప్రభుత్వం సూచించింది. ఈ అంశాలను బట్టి శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో విలీనం చేస్తారన్న ఆశ స్థానిక ప్రజల్లో కనిపిస్తోంది.
విశాఖతోనే అనుబంధం ఎక్కువ..
విజయనగరం జిల్లా ఏర్పడక ముందు శృంగవరపుకోట నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలోనే ఉండేది. అయితే 1971లో శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాలు, విశాఖ జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలను కలిపి విజయనగరం జిల్లాగా అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఎస్.కోట విశాఖ జిల్లా నుంచి వేరైంది. అయినప్పటికీ ఆ జిల్లాతోనే ఇక్కడి ప్రజలకు అనుబంధం ఎక్కువ. ఉపాధి, ఉద్యోగాలు అక్కడే చేస్తున్నారు. ఎస్.కోట నియోజకవర్గ పరిధిలోని కొత్తవలస పట్టణం విశాఖకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖ నుంచి అరకుకు వెళ్లే ప్రధాన రహదారి కూడా ఎస్.కోట పరిధిలోనే ఉంటుంది. ఏ అవసరం వచ్చినా ఇక్కడి ప్రజలు విశాఖకే వెళ్తుంటారు. కేవలం ప్రభుత్వ పరమైన అవసరాలకు మాత్రమే విజయనగరం జిల్లాలోని కార్యాలయాలకు వెళ్తుంటారు.
పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం..
గత వైసీపీ ప్రభుత్వం 2022లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న శృంగవరపుకోట ఆ జిల్లాలో కలిసిపోతుందని ఇక్కడి ప్రజలు సంబరపడ్డారు. కానీ, ఎస్.కోటను విజయనగరం జిల్లాలోనే ఉంచేశారు. దీన్ని ఈ ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకించినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, తాము అధికారంలోకి వస్తే ఎస్.కోటను విశాఖలో కలిపేస్తామని 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అనుకున్నట్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లాల పునర్విభజనపై మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో విశాఖపట్నం జిల్లాలో ఎస్.కోట నియోజకవర్గం విలీనంపై స్థానికులు ఆశలు పెట్టుకున్నారు.
అభివృద్ధి వైపు అడుగులు..
ఎస్.కోట నియోజకవర్గం ప్రస్తుతం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొత్తవలస మండలంలో శారడ స్టీల్, జిందాల్ ఫెర్రో, లక్కవరపుకోట మండలంలో సింహాద్రి స్టీల్, మంగళ్ టీఎంటీ వంటి పరిశ్రమలు ఉన్నాయి. కొత్తవలసలో కొత్తగా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటవుతుంది. జామి మండలంలో ఇప్పటికే సిమెంట్ కంపెనీ ఉంది. ఎస్.కోట మండల పరిధిలోని జిందాల్ భూముల్లో ఇండస్ట్రీయల్ పార్కులు, కొత్తవలస మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కులను నెలకొల్పే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. విశాఖ-అరకు రోడ్డు, రాయపూర్ గ్రీన్‌పీల్డ్ హైవే వంటివి ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. రైలు మార్గం కూడా దగ్గరలో ఉంది. నూతనంగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయం సైతం దగ్గరే. వీటికి తోడు విశాఖ జిల్లాలో ఎస్.కోటను కలిపేస్తే మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికుల మాట.
Updated Date - Jul 27 , 2025 | 12:07 AM