Hi-tech cultivation హైటెక్ సాగు
ABN, Publish Date - May 14 , 2025 | 11:58 PM
Hi-tech cultivation వ్యవసాయంలో యాంత్రీకరణ గణనీయంగా పెరిగింది. ఇప్పటికే అనేక ఆధునిక యంత్రాలు వచ్చేశాయి. డ్రోన్ల వినియోగం కూడా పెంచాలని ఈ ప్రభుత్వం సంకల్పించింది. కూలీల ధరలు, కూలీల కొరతతో వ్యవసాయమంటేనే రైతులు వెనకడుగేసే పరిస్థితి ఉంది. ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం పొందాలంటే డ్రోన్లను విరివిగా వాడాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. వాటిని రాయితీపై అందివ్వనుంది. ఉమ్మడి జిల్లాలో 34 రైతు బృందాలకు తొలి విడతగా మంజూరు చేయనుంది.
హైటెక్ సాగు
డ్రోన్లతో వ్యవసాయంపై విస్తృత ప్రచారం
తొలి విడతగా ఉమ్మడి జిల్లాలో 34 రైతు బృందాలకు మంజూరు
రాయితీతో పాటు బ్యాంకు రుణం
22 మందికి తాజాగా శిక్షణ పూర్తి
వ్యవసాయంలో సాగు పెట్టుబడులు తగ్గించేందుకే
వ్యవసాయంలో యాంత్రీకరణ గణనీయంగా పెరిగింది. ఇప్పటికే అనేక ఆధునిక యంత్రాలు వచ్చేశాయి. డ్రోన్ల వినియోగం కూడా పెంచాలని ఈ ప్రభుత్వం సంకల్పించింది. కూలీల ధరలు, కూలీల కొరతతో వ్యవసాయమంటేనే రైతులు వెనకడుగేసే పరిస్థితి ఉంది. ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం పొందాలంటే డ్రోన్లను విరివిగా వాడాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. వాటిని రాయితీపై అందివ్వనుంది. ఉమ్మడి జిల్లాలో 34 రైతు బృందాలకు తొలి విడతగా మంజూరు చేయనుంది.
రాజాం, మే 14 (ఆంధ్రజ్యోతి):
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని సీఎం చంద్రబాబునాయుడు సంకల్పించారు. ఇదే విషయాన్ని విజన్ 2047లోనూ పేర్కొన్నారు. సాగులో ఖర్చులు తగ్గించుకునేందుకు ఇదే ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోనూ అన్నదాతలకు విస్తృతంగా అవగాహన పరిచారు. తొలి విడతగా ఉమ్మడి జిల్లాలో 34 రైతు బృందాలకు డ్రోన్లను మంజూరు చేయనున్నారు. విజయనగరం జిల్లాలో 24 రైతు బృందాలకు, పార్వతీపురం మన్యంలో 10 బృందాలకు డ్రోన్లు మంజూరు చేయనున్నారు. ఇందుకోసం విజయనగరం జిల్లాలో 13 మంది.. పార్వతీపురం మన్యంలో 9 మంది శిక్షణ పొందారు. ఒక్కొక్కరిపై శిక్షణకు రూ.70 వేలు ఖర్చుచేశారు. ఐదుగురు సభ్యులున్న రైతుల బృందానికి ఒక డ్రోన్ మంజూరు చేస్తారు. వీరిలో ఒకరు సాంకేతిక విద్య, మరొకరు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇప్పటికే ఎంపికైన వారికి గుంటూరు, విజయవాడలో శిక్షణనిచ్చారు. త్వరలో మరికొందరు వెళ్లనున్నారు. మహిళా రైతులకు సైతం అవకాశం కల్పిస్తున్నారు. శిక్షణ అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) లైసెన్స్ కూడా మంజూరు చేస్తారు. సుమారు రూ.10 లక్షలు విలువచేసే డ్రోన్లను రాయితీపై అందిస్తారు. లబ్ధిదారుడు తన వాటాగా తొలుత రూ.5 లక్షలు చెల్లించాలి. మిగిలిన రూ.5 లక్షలకు బ్యాంకుల నుంచి రుణం వస్తుంది. రెండు నెలల తరువాత బ్యాంకు ఖాతాలో రాయితీ సొమ్ము జమ చేయనుంది. రైతు పెట్టుబడిగా పెట్టిన రూ.5 లక్షలు వెనక్కి ఇచ్చేస్తుంది. రుణాన్ని నెలవారీ వాయిదా పద్ధతిలో జమ చేయించేలా చర్యలు తీసుకుంటోంది.
చిన్న, సన్నకారు రైతులే..
ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో 4.26 లక్షల ఎకరాలు, రబీలో 2.59 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. మొత్తం 3.56 లక్షల మంది రైతులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మూడొంతుల మంది చిన్నసన్నకారు రైతులే. వీరు సొంతంగా వ్యవసాయ పరికరాలు, యంత్రాలను కొనుగోలు చేసుకోలేరు. గతంలో టీడీపీ ప్రభుత్వం 70 శాతం రాయితీపై పంట కోత యంత్రాలు, 50 శాతం సబ్సిడీపై స్ర్పేయర్లు, బరకాలను సాధారణ రైతులకు అందించేది. ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉండడంతో సాగులో పెట్టుబడులు, మదుపులు తగ్గేవి. కానీ గత ఐదేళ్లలో రైతుభరోసా అందిస్తున్నామని ఒకే ఒక కారణం చెప్పి రాయితీ పథకాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం పలికింది. అప్పట్లో డ్రోన్లు అందిస్తామని హడావుడి చేశారు. మండలానికి రెండు డ్రోన్ల చొప్పున మొత్తం 60 అందిస్తామన్నారు. నిరుద్యోగ యువకులకు శిక్షణ కూడా ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 20 మంది, విజయనగరం జిల్లాలో 27 మందికి శిక్షణ ఇచ్చారు. కానీ డ్రోన్లను అందించలేదు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకు డ్రోన్లను విరివిగా అందించేందుకు కసరత్తు చేస్తోంది.
వ్యవసాయంలో పెరిగిన మదుపులు..
సాగులో పెట్టుబడులు పెరిగాయి. కూలీల ధరలు భారంగా మారాయి. మదుపులు గురించి చెప్పనవసరం లేదు. ఎకరా పొలంలో క్రిమిసంహారక మందులు, ఎరువుల పిచికారీకి అవుతున్న ఖర్చు అక్షరాలా రూ.2వేలు. అదే డ్రోన్ల ద్వారా అయితే చాలా తక్కువతో పూర్తవుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు డ్రోన్ల సాయంతో సస్యరక్షణ చేపడుతున్నారు. తక్కువ ఖర్చు అని రైతులు చెబుతున్నారు. డ్రోన్‌తో రోజుకు పది ఎకరాల్లో సస్యరక్షణ చేపట్టవచ్చు.
శుభ పరిణామం..
వ్యవసాయంలో సాగు పెట్టుబడులు పెరిగాయి. రైతుల కొరత వేధిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వం డ్రోన్ల సేవలను అందుబాటులోకి తెస్తుండడం శుభ పరిణామం. భవిష్యత్‌లో వ్యవసాయంలో డ్రోన్ల సేవలను విస్తరించాలి. ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున అందించాలి.
శిలంకి పకీరునాయుడు. రైతు, కొప్పర, వంగర మండలం
పెట్టుబడులు తగ్గుతాయి
వీటీ రామారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
రైతుకు వ్యవసాయంలో అధికంగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని ప్రభుత్వం గుర్తించి డ్రోన్ల విధానం తీసుకువచ్చింది. దీనిపై అవగాహనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం డ్రోన్లను రాయితీపై అందిస్తుంది. ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వసాయి. విజయనగరం జిల్లాకు 24 డ్రోన్లు మంజూరుయ్యాయి. రైతులు గ్రూపులుగా ఏర్పడి బ్యాంకు ఖాతాలు తెరిచి రూ.5 లక్షలు జమ చేయాలి. ఆ తర్వాత రాయితీపై రూ.5లక్షలు తిరిగి పొందవచ్చు. మిగతా డబ్బుల కోసం బ్యాంకు రుణం తీసుకోవచ్చు.
Updated Date - May 14 , 2025 | 11:58 PM