Hill encroachment కొండ కబ్జా
ABN, Publish Date - May 31 , 2025 | 11:01 PM
Hill encroachment భోగాపురంలో భూమి ధర బంగారాన్ని మించిపోయింది. విపరీతమైన డిమాండ్ ఉండడంతో రోజుల వ్యవధిలోనే ధర మారిపోతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు కబ్జాదారులు కూడా ఎక్కడికక్కడ తిష్ఠ వేసే పనిలో ఉన్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే వాలిపోతున్నారు. తాజాగా రావాడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 64లో సుమారు 17 ఎకరాల వరకు ఉన్న కొండ వద్ద కబ్జాపర్వాం సాగుతోంది.
కొండ కబ్జా
8 ఎకరాలకు పైగా ఆక్రమణ
చదును చేసి మొక్కలేసిన వైనం
భోగాపురం, మే31(ఆంధ్రజ్యోతి): భోగాపురంలో భూమి ధర బంగారాన్ని మించిపోయింది. విపరీతమైన డిమాండ్ ఉండడంతో రోజుల వ్యవధిలోనే ధర మారిపోతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు కబ్జాదారులు కూడా ఎక్కడికక్కడ తిష్ఠ వేసే పనిలో ఉన్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే వాలిపోతున్నారు. తాజాగా రావాడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 64లో సుమారు 17 ఎకరాల వరకు ఉన్న కొండ వద్ద కబ్జాపర్వాం సాగుతోంది. ఇక్కడి స్థలంలో ప్రభుత్వం 3.18 ఎకరాలు పునరావాసకాలనీకి, మరో 5 ఎకరాలు రైతులకు డిపట్టాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన స్థలంలో కొంతైనా ఆక్రమించే పనిలో కొందరు వ్యక్తులు నిమగ్నమయ్యారు. అధికారికంగా ఇంకా సుమారు 8 ఎకరాలకు పైగా కొండ ఉండాలి. ఇదే ప్రాంతంలో అభివృద్ధి కోసం వీఎంఆర్‌డిఎకు స్థలం ఇచ్చేందుకు ఇటీవల అధికారులు పరిశీలించారు. ఇదివరకే కొండను తవ్వి తరలించుకుపోవడంతో ఆప్రాంతం తరిగిపోతూ వచ్చింది. ఇదే అదనుగా భూ త్రిమింగళాలు కొండ ప్రాంతంపై కన్నేశాయి. దర్జాగా కొబ్బరి మొక్కలు కూడా వేసుకొని పాగా వేశాయి. మరోవైపు డిపట్టా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసుకొని ఆక్రమించిన భూమితో సహా ప్లాట్లుగా వేసేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం బహిరంగంగా కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సమాచారం అందినా పట్టించుకోవడం లేదు. కబ్జా అంశాన్ని తహసీల్దార్ ఎం.సురేష్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - May 31 , 2025 | 11:01 PM