జనగణనకు గ్రీన్‌సిగ్నల్ Green signal for census
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:57 PM
Green signal for census జనగణనకు కేంద్ర హోంశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. 2011లో చివరిసారిగా జనగణన పూర్తిచేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఉద్దేశించిన పథకాల రూపకల్పనకు జనాభాలెక్కలే కీలకం. పాలనా సౌలభ్యం, అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి, పేదరిక నిర్మూలన వంటి అంశాలకు జనగణన ఆధారంగా ఉంటుంది.
జనగణనకు గ్రీన్‌సిగ్నల్
నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర హోంశాఖ
16వ జనాభా లెక్కల సర్వేకు సమాయత్తం
కులగణనకూ అవకాశాలు
జిల్లాలో జనాభాతో పాటు అనేక మార్పులకు అవకాశం
రాజాం రూరల్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): జనగణనకు కేంద్ర హోంశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. 2011లో చివరిసారిగా జనగణన పూర్తిచేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఉద్దేశించిన పథకాల రూపకల్పనకు జనాభాలెక్కలే కీలకం. పాలనా సౌలభ్యం, అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి, పేదరిక నిర్మూలన వంటి అంశాలకు జనగణన ఆధారంగా ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జనగణన 2021లో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. కొవిడ్ తగ్గుముఖం పట్టాక 2024లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జనగణనకు అవకాశం లేకపోయింది. తాజాగా కేంద్ర హోంశాఖ 16వ జనాభా లెక్కల నిర్వహణకు పచ్చజెండా ఊపడంతో జిల్లా యంత్రాంగం సమాయిత్తం అవుతోంది. ఈసారి జనగణనతో పాటు కులగణన సర్వే కూడా జరిపే అవకాశాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కలతో సరిపోలిస్తే జిల్లాలో ఈసారి మరిన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి.
నాటి సర్వేలో..
2011లో చేపట్టిన సర్వేలో జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాలు జిల్లాలో ఉండేవి. రాజాం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటయ్యింది. ఆ జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాలు చేరాయి. అలాగే ఏడు దశాబ్దాలకు పైగా శ్రీకాకుళం జిల్లాలో ఉండే రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో విలీనం చేశారు. దీంతో భౌగోళికంగా మార్పులు చోటు చేసుకున్నాయి. నియోజవర్గాల సంఖ్య తొమ్మిది నుంచి ఏడుకు పరిమితమైంది. 2027 మార్చి నాటికి జనగణన పూర్తి కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో జనగణన పూర్తయితే జిల్లా సమగ్ర సమాచారం లెక్క తేలనుంది.
కులగణన సైతం..
సమగ్ర కులగణన సైతం చేపట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. బ్రిటీషర్ల హయాంలో రెగ్యులర్‌గా నిర్వహించే కులగణనను స్వాతంత్య్రం వచ్చాక జనగణన నుంచి తప్పించారు. దీంతో దశాబ్దాలుగా మరుగున పడిన కులగణన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి చేపట్టాలని వివిధ సామాజికవర్గాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు కులగణన సర్వే రాష్ట్ర ప్రాతిపదికన నిర్వహించి కూడా ఆ వివరాలను బహిర్గతం చేయలేదు. కులాల వారీగా జనాభా లెక్కలు వెల్లడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్లతో పాటు వెనుకబడిన సామాజికవర్గాల అభ్యున్నతికి సబ్‌ప్లాన్ అమలు చేసేందుకు వీలవుతుందని ఆయా సామాజికవర్గాలు భావిస్తున్నాయి. జనగణనలో కులగణన కూడా భాగమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించిన నేపథ్యంలో కులగణన సర్వే ఈసారి ఖఛ్చితంగా జరుగుతుందని ఆయా సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
డిజిటల్ యాప్ ద్వారా..
జనగణనకు సంబంధించి ప్రభుత్వం ఈసారి డిజిటల్ యాప్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. రెండు దశల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా తొలిదశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా ప్రజల ఇంటి పరిస్థితులు, వారి ఆస్తులు, ఇళ్లల్లో ఉండే సౌకర్యాల వివరాలను సేకరిస్తారు. రెండోదశలో ప్రజల సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వివరాలను సేకరించనున్నారు. ఎన్యూమరేటర్లు, సిబ్బందితో పాటు ఈసారి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వీలు కల్పించనున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరచుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
చివరిసారిగా 2011లో
బాలాజీ, సీపీవో, విజయనగరం
2011లో చివరిసారిగా జనగణన జరిగింది. 2021లో జరగాల్సి ఉండగా కొవిడ్, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ అంబేడ్కర్ సారధ్యంలో జిల్లాలో జనగణన జరగనుంది. జనగణనకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
2011 జనాభా లెక్కల ప్రకారం..
పురుషులు 9,60,450
స్త్రీలు 9,70,361
మొత్తం 19,30,811
.................................................
Updated Date - Jun 17 , 2025 | 11:57 PM