రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ మంచి రోజులు
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:35 AM
భూ క్రయ అగ్రిమెంట్‌తో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (సేల్‌కం జీపీఏ) దస్తావేజుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
-స్టాంపు డ్యూటీని ఒక శాతానికి తగ్గించిన ప్రభుత్వం
- పెరగనున్న జీపీఏ రిజిస్ట్రేషన్లు
- స్థిరాస్తి వ్యాపారుల్లో ఆనందం
- పుంజుకోనున్న ఆ రంగం
కొత్తవలస/బొబ్బిలి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): భూ క్రయ అగ్రిమెంట్‌తో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (సేల్‌కం జీపీఏ) దస్తావేజుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో సేల్‌కం జీపీఏ దస్తావేజులకు సంబంధించి 5శాతం వరకు ఉన్న స్టాంపు డ్యూటీని ప్రభుత్వం ఒక శాతానికి తగ్గించింది. అలాగే స్థిరాస్తి వ్యాపారంలో భూయజమానులు, బిల్డర్ల మధ్య జరిగే ఒప్పందాలకు (డెవలప్‌మెంట్ అగ్రిమెంట్) సంబంధించి గతంలో ఉన్న 4శాతం స్టాంపుడ్యూటీని ఇప్పుడు ఒక శాతానికి తగ్గించింది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదస్పద జీవోను రద్దు చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాలు లేవు. పైగా మూడో పార్టీకి ఆస్తిని విక్రయించాలంటే రెండుసార్లు స్టాంపు డ్యూటీని చెల్లించాల్సి వచ్చేది. దీనివల్ల రియల్టర్లు ఇబ్బందులు పడేవారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయి ఆ రంగం పూర్తిగా పడకేసింది. వాస్తవానికి రియల్‌ఎస్టేట్ వ్యాపారులు భూములను కొనుగోలు చేసుకుని, వెంచర్లు వేసుకునేందుకు రైతుల నుంచి క్రయ అగ్రిమెంట్‌తో కూడిన జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారు. గతంలో ఇలాంటి రిజిస్ట్రేషన్లకు ఆస్తి విలువపై ఒక శాతం స్టాంపు డ్యూటీ పెట్టుకునేవారు. తరువాత కాలంలో జీపీఏకు సంబంఽదించి స్టాంపు డ్యూటీని ఆస్తి విలువపై 5శాతం చెల్లించాల్సి వచ్చేది. ఇలా 5 శాతం స్టాంపు డ్యూటీ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరికొద్ది రోజుల్లోనే ఆ భూములను ఎవరికైనా విక్రయించుకునేవారు. దీనికిగాను క్రయ దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయిస్తే గతంలో స్టాంపు డ్యూటీగా పెట్టిన 5శాతంలో ఒకశాతాన్ని రియల్టర్లు వదులుకునేవారు. మిగిలిన నాలుగు శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉండేది. ఉదాహరణకు స్థిరాస్తులను నేరుగా క్రయ దస్తావేజులుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 6.5శాతం స్టాంపు డ్యూటీ పెట్టాలి. సేల్ కం జీపీఏ నుంచి క్రయ దస్తావేజుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అప్పటికే 5శాతం స్టాంపు డ్యూటీ చెల్లించినందున, ఆస్తి విలువపై 2.5శాతం స్టాంపు డ్యూటీ చెల్లిస్తే సరిపోయేది. అయితే, గత వైసీపీ ప్రభుత్వం 2021లో కొత్త జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం 5శాతం స్టాంపుడ్యూటీ చెల్లించి సేల్‌కం జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, అదే ఆస్తిని మళ్లీ మూడో వ్యక్తికి విక్రయిస్తే పూర్తి స్టాంపు డ్యూటీ 6.5శాతం చెల్లించాల్సి వచ్చేది. మొత్తంగా 11.5శాతం స్టాంపు డ్యూటీ వసూలు చేసేవారు. చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెండుసార్లు స్టాంపుడ్యూటీ చెల్లించేందుకు ఇబ్బందులు పడేవారు. దీంతో జీపీఏ రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ఒక్క బొబ్బిలి ప్రాంతంలోనే సుమారు వెయ్యి ఎకరాల్లో రియల్‌ఎస్టేట్ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు అంచనా. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదువేల ఎకరాలకు పైబడి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్లు తెలిసింది.
ప్రభుత్వ నిర్ణయంపై ఆనందం
కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మళ్లీ పట్టాలెక్కించాలనే ధ్యేయంతో సేల్‌కం జీపీఏల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది. ఆస్తి విలువపై 5శాతం స్టాంపు డ్యూటీ చెల్లించి జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని చెప్పింది. ఆ ఆస్తిని మూడో పార్టీకి విక్రయించినప్పుడు స్టాంపు డ్యూటీలో 4 శాతం మినహాయింపు ఉంటుందని తెలిపింది. అలాగే యజమాని, బిల్డర్ మధ్య జరిగే డెవలప్ మెంట్ అగ్రిమెంట్‌కు సంబంధించి ఆస్తి విలువపై ఒకశాతం స్టాంపుడ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో స్థిరాస్తి వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్లు పెరిగి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఎక్కువుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు.
హర్షనీయం..
స్టాంపు డ్యూటీని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయం. స్థిరాస్తి సేల్ కమ్ జీపీఏకు సుమారు 7శాతం వరకు స్టాంపు డ్యూటీకి గతంలో ఖర్చయ్యేది. ఇది కొనుగోలు, అమ్మకందారులకు చాలా భారంగా ఉండేది. అంత పెద్ద మొత్తం భరించడానికి ఇబ్బందులు పడేవారు. అందరి విన్నపాలపై స్పందించిన ప్రభుత్వం ఒక్క శాతానికి స్టాంపు డ్యూటీని తగ్గించడం ఆనందంగా ఉంది. దీనివల్ల రియల్‌ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది.
-నాగేంద్ర, ఆర్కిటెక్చర్, సభాపతి, డాక్యుమెంట్ రైటర్ బొబ్బిలి
Updated Date - Aug 02 , 2025 | 12:36 AM