కొడుకుతో వెళుతూ.. కానరాని లోకాలకు
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:46 PM
కొడుకుతో పొలానికి స్కూటీపై వెళ్లిన తండ్రి.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన సాలూరు గొర్లెవీధిలో ఆదివా రం చోటుచేసుకుంది.
గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి మృతి
సాలూరు రూరల్, జూలై13 (ఆంధ్రజ్యోతి): కొడుకుతో పొలానికి స్కూటీపై వెళ్లిన తండ్రి.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన సాలూరు గొర్లెవీధిలో ఆదివా రం చోటుచేసుకుంది. సాలూరు రూరల్ హెచ్‌సీ బంగా ర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు పట్టణం గొర్లె వీధికి చెందిన గొర్లె ధర్మారావు(43)కు సాలూరు బైపాస్ రోడ్డులో పొలం ఉంది. ఆదివారం ఆయన తన కొడుకు గుణశేఖర్(14)ను వెంట బెట్టుకుని స్కూటీపై పొలానికి వెళ్లారు. అక్కడ నుంచి తండ్రీ కొడుకులు బైపాస్ రోడ్డుపై జీగిరాం వైపు వెళ్తున్నారు. అదే సమయంలో స్కూటీని వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ ఎగిరి పడ్డారు. స్కూటీని ఆ వాహనం కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన లో ధర్మారావు తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడక్కడే మృతిచెందారు. గుణశేఖర్ గాయపడటంతో అతడిని తొలుత సాలూరు ఏరియా ఆసుపత్రికి, అక్కడ నుంచి విజయనగరంలో ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అలివేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెచ్‌సీ తెలిపారు.
Updated Date - Jul 13 , 2025 | 11:46 PM