పోలింగ్ స్టేషన్ల హేతబద్ధీకరణకు సలహాలు ఇవ్వండి
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:49 PM
జిల్లాలో పోలింగ్‌స్టేషన్ల హేతుబద్ధీకరణకు తగిన సలహాలు ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
- జిల్లా రెవెన్యూ అధికారి హేమలత
పార్వతీపురం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలింగ్‌స్టేషన్ల హేతుబద్ధీకరణకు తగిన సలహాలు ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం ఆమె తన చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. ప్రతి నెలా డీఈవో లేదా ఈఆర్‌వో స్థాయి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించినట్టు తెలిపారు. డీఈవో, ఈఆర్‌వో, బీఎల్‌వోలతో సహా అధికారులందరూ పారదర్శకంగా పనిచేయాలని సూచించినట్టు చెప్పారు. ఈసీ జారీ చేసే నియమాలు, మార్గదర్శకాలపై తగిన సలహాలను జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు నుంచి కోరుతున్నట్టు ఆమె తెలిపారు. పోలింగ్‌బూత్‌లో 800 నుంచి 1200 మంది ఓటర్లు ఉండేలా చూడాలని, ప్రతి ఓటరు నివాసం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఈసీ ఆదేశించినట్టు వివరించారు. హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రతి ఈఆర్‌వో రానున్న రెండు నెలల్లోపు పోలింగ్ కేంద్రాలను విలీనం చేయడం, ఓటర్లను సమీప పోలింగ్ కేంద్రాలకు మార్చడం వంటివి చేపట్టాల్సి ఉందన్నారు. ఆరోగ్యకరమైన ఓటరు జాబితాను తయారు చేసేందుకు బీఎల్‌వోలకు రాజకీయ పక్షాలు సహకరించాలన్నారు. ఇందుకు సంబంధిత పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్‌కు బూత్‌లెవెల్ ఏజెంట్‌ను నియమించాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ల ఫొటో గ్రాఫ్, మొబైల్ నెంబర్‌ను చేర్చడానికి ఫారం బీఎల్‌ఏ-2కు ఎన్నికల సంఘం కొన్ని సవరణలు చేసిందని అన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 11:49 PM