Give notices to those three hospitals. ఆ మూడు ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వండి
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:07 AM
Give notices to those three hospitals.మాతాశిశువుల పట్ల నిర్లక్ష్యం వహించిన మూడు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు.
ఆ మూడు ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వండి
తప్పు చేసేవారిపై క్రిమినల్ చర్యలు తప్పవు
గర్భిణులు, శిశువుల మృతిపై నివేదిక ఇవ్వాలి
కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం/కలెక్టరేట్, జూన్ 3(ఆంధ్రజ్యోతి):
మాతాశిశువుల పట్ల నిర్లక్ష్యం వహించిన మూడు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 74 శాతం తల్లులకు సిజేరియన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన జిల్లా ఎంపీసీడీఎస్‌ఆర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మాత, శిశుమరణాలు చోటుచేసుకోవడం సరికాదని, ఎందుకు అలాంటి పరిస్థితి వస్తోందని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో గర్భిణులకు ట్రీట్‌మెంట్ పేరుతో వేలాది రూపాయలు లాగేస్తున్నారని, పరిస్థితి చేయి దాటాక నెలలు నిండిన తల్లిని ఘోషా లేదా పీహెచీసీ, సీహెచ్‌సీలకు రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో తల్లి లేదా శిశువు మృతిచెందితే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, తప్పు జరిగితే క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని ఆదేశించారు. జిల్లాలో ప్రసవ సమయం, ప్రసవానంతరం గర్భిణులు, శిశువులు మృతి చెందిన ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌వో జీవనరాణిని ఆదేశించారు. గర్భిణులు వెంపడాపు లీలావతి, బంగారి సుధ మరణంపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. కొరమ దుర్గ మృతి విషయంలో పీజీస్టార్ ఆసుపత్రికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. మాతాశిశు మరణాలు సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది ఇస్తున్న నివేదికలు పొంతన లేకుండా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయిలో ఇరు శాఖల అధికారులు నెలకొకసారి సమావేశమై చర్చించుకోవాలన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ డాక్టరు శుభశ్రీ రాణి, డీఐవో డాక్టరు అచ్యుతకుమారి, సీడీపీఓ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు సమావేశానికి రాకపోవడంపై మండిపడ్డారు.
Updated Date - Jun 04 , 2025 | 12:07 AM