Construction of Toilets మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు
ABN, Publish Date - Apr 20 , 2025 | 11:39 PM
Funds for Construction of Toilets జిల్లాలో వసతి గృహాలతో పాటు పంచాయతీల పరిధిలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. వాటి పనుల బాధ్యతను గ్రామీణ తాగునీటి విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) శాఖకు అప్పగిస్తూ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
తప్పనున్న విద్యార్థులు, పల్లెవాసుల కష్టాలు
గరుగుబిల్లి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వసతి గృహాలతో పాటు పంచాయతీల పరిధిలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. వాటి పనుల బాధ్యతను గ్రామీణ తాగునీటి విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) శాఖకు అప్పగిస్తూ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఆయా ప్రాంతాల్లో జియోట్యాగింగ్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. జిల్లాలోని 15 మండలాల్లో 244 సామూహిక మరుగుదొడ్లుకు (సీఎస్‌సీ) రూ. 7.32 కోట్లు , వసతి గృహాలకు సంబంధించి రూ. 36 లక్షలు మంజూరు చేశారు. స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పంచా యతీల పరిధిలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరయ్యాయి. ప్రధానంగా రహదారులు, సంతలు, పర్యాటక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇకపోతే నర్సిపురం, బూర్జ, రావివలస, చినమేరంగి, పాలకొండ, వీరఘట్టం, కురుపాం తదితర ప్రాంతాల్లో బీసీ బాలుర, బాలికలు ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టి రూపుమార్చనున్నారు.
ఆదేశాలు అందాయి
వసతి గృహాలతో పాటు పంచాయతీల పరిధిలో మురుగుదొడ్లు నిర్మాణాలకు కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయి. పంచాయతీల పరిధిలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 3 లక్షలతో అంచనాలు రూపొందించాం. టెండర్లు కాకుండా నామినేషన్ పద్ధతుల్లో పనులు నిర్వహిస్తాం. వాటిని డిసెంబరుకు పూర్తి చేయాల్సి ఉంది. ప్రత్యేక యాప్‌లో వివరాలు పొందు పర్చనున్నాం. నిబంధనల మేరకు పనులు పూర్తయిన తర్వాత చెల్లింపులవుతాయి. ఇప్పటికే శంకుస్థాపనలు చేశాం. వసతి గృహాల పరిధిలోనూ పనులు ప్రారంభించనున్నాం.
- ఒ.ప్రభాకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పార్వతీపురం మన్యం
Updated Date - Apr 20 , 2025 | 11:40 PM