నేటి నుంచి ప్రజల్లోకి..
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:50 PM
అధికార, విపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాయి.
- సిద్ధమవుతున్న పార్టీలు
- ‘సుపరిపాలనలో తొలి అడుగు’తో కూటమి
- ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’తో వైసీపీ
- జనం మధ్యలో ఉండేలా ప్లానింగ్
-కూటమి ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో గాడితప్పిన వ్యవస్థలను సరిచేస్తూనే ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాం. కానీ, చేసిన పనిని చెప్పుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నాం. అందుకే ప్రజల మధ్యకు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లాలి. వారికి వాస్తవాలు తెలియజేయాలి. ఇటీవల అమరావతిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలివి.
-కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం లేదు. అందుకే ప్రజల మధ్యకు వెళ్లి చంద్రబాబు, పవన్ సర్కారు చర్యలను ఎండగట్టండి. ముఖ్యంగా కూటమి మేనిఫెస్టోను గుర్తుచేయండి. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో యాప్‌ను సద్వినియోగం చేసుకోండి. ఇటీవల జరిగిన వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోర్డినేటర్ల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపు ఇది.
విజయనగరం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): అధికార, విపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాయి. చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి అధికార పక్షం సిద్ధమవుతుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షం సన్నద్ధమవుతోంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు బుధవారం నుంచి ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. ఏడాదిలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. వైసీపీ నాయకులు కూడా ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లనున్నారు. దీంతో జూలై నెలలో జిల్లాలో ప్రకంపనలు రేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కూటమి శ్రేణులు సిద్ధం
ఉమ్మడి జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో బుధవారం నుంచి ప్రజల మధ్యకు వెళ్లేందుకు కూటమి శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు పూసపాటి అశోక్‌గజపతిరాజు, కళా వెంకటరావు సూచనలతో ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరించనున్నారు. పింఛన్ల మొత్తం పెంపు, అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం, ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం, ఉచిత ఇసుక, సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం, డీఎస్సీ, రేషన్ షాపులు పునఃప్రారంభం, రహదారులు, గోశాలల నిర్మాణం, కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలను తెలియజేయనున్నారు. ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, రానున్న రోజుల్లో చేయబోయే కార్యక్రమాలను వివరించనున్నారు. అలాగే, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను కూడా ప్రజలకు చెప్పనున్నారు. కాగా, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని గంట్యాడ, బొండపల్లి తదితర మండలాల్లో పార్టీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
వైసీపీ శ్రేణులు ముందుకొచ్చేనా?
జూలై నెలంతా ప్రజల్లో ఉండేలా వైసీపీ నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఐదు వారాల పాటు ప్రజల మధ్యలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో యాప్‌తో ప్రతి కుటుంబాన్నీ పలకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అయితే, క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణులు ముందుకొస్తాయా? లేదా అన్నది అనుమానమే. ఇప్పటికే సీనియర్ నేతలు, కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జిలు అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో అధినేత జగన్ ఇచ్చిన పిలుపు ఎంతవరకు విజయవంతం అవుతుందా? అన్నది చూడాలి. అలాగే, గురువారం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు జిల్లా నాయకులు హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే శ్రేణులను భాగస్వాములు చేయడం, వారిని ఉత్తేజం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
11111111111111111111111111
Updated Date - Jul 01 , 2025 | 11:50 PM