Focusing on Affordable Housing. గృహయోగమే లక్ష్యంగా..
ABN, Publish Date - Apr 21 , 2025 | 11:43 PM
Focusing on Affordable Housing జిల్లాలో సగంలో నిలిచిపోయిన పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు అదనపు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వచ్చే నెల 31 నాటికి పెండింగ్ గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం
వచ్చేనెల 31 నాటికి పెండింగ్ పనుల పూర్తికి చర్యలు
పార్వతీపురం, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సగంలో నిలిచిపోయిన పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు అదనపు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వచ్చే నెల 31 నాటికి పెండింగ్ గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ హయాంలో మంజూరైన ఇళ్లు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన గృహ నిర్మాణాల వివరాలను ఇప్పటికే సేకరించింది. వాటి పనుల పూర్తికి గాను బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేల చొప్పున మంజూరు చేసింది. దీంతో వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలకు మోక్షం లభించినట్లయ్యిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దశల వారీగా...
జిల్లాలో మొదటి విడతలో 5,897 గృహ నిర్మాణాల పూర్తికి ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ఎస్సీలు 852 మంది, ఎస్టీలు 1646 మంది, బీసీ లబ్ధిదారులు 2,699 మంది ఉన్నారు. మొత్తంగా పెండింగ్ ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం సుమారు రూ.8.30 కోట్లు అదనపు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. తిరిగి ప్రారంభించిన ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలో ఉంటే రూ.15 వేలు, రూప్ లెవల్‌కు వస్తే రూ.15 వేలు, శ్లాబు స్థాయియి చేరితే రూ.10 వేలు , ప్లాస్టింగ్ జరిగిన పని పూర్తయ్యేక రూ.పది వేలు ఇలా బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు అదనపు సాయం అందిస్తున్నారు. అదే ఎస్టీ లబ్ధిదారులకైతే మొదటి దశలో రూ.22,500, రెండో దశలో మరో రూ.22,500, మూడో దశలో రూ.15 వేలు, నాలుగో దశలో రూ.15 వేలు చొప్పున విడుదల చేస్తారు. పీటీజీ గ్రూప్‌లకు అయితే రూ. లక్ష వివిధ దశల్లో అందిస్తారు.
గతంలో ఇలా...
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇళ్ల బిల్లులను పూర్తిగా చెల్లించడం మానేసింది. లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసింది. గృహ నిర్మాణ లబ్ధిదారులపై కూడా రాజకీయ కక్ష సాధింపులకు దిగింది. దీంతో ఎంతోమంది ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకోలేకపోయారు. మరికొంతమంది లబ్ధిదారులు అప్పులు చేసి మధ్యలో నిలిచిన గృహ పూర్తి చేసుకున్నారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గృహ నిర్మాణదారులతో పాటు జగనన్న కాలనీల్లో సగంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలు, నిరుపేదలైన లబ్ధిదారులపైనా దృష్టి సారించింది. బిల్లుల చెల్లింపు, అదనపు సాయానికి చర్యలు చేపడుతుం డడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో గత వైసీపీ సర్కారు తీరుపై పెదవి విరుస్తున్నారు.
Updated Date - Apr 21 , 2025 | 11:43 PM