కస్తూర్బా పాఠశాలలో మళ్లీ అగ్ని ప్రమాదం
ABN, Publish Date - Jul 08 , 2025 | 11:57 PM
తుమ్మికాపల్లి కస్తూర్బా బాలికల పాఠశాలలో మంగళవారం రాత్రి మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది.
కొత్తవలస, జూలై 8(ఆంధ్రజ్యోతి) : తుమ్మికాపల్లి కస్తూర్బా బాలికల పాఠశాలలో మంగళవారం రాత్రి మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. ఈసారి గ్రౌండ్‌ఫ్లోరులోని ఇంటర్ మొదటి సంవత్సరం తరగతి గదిలో చోటుచేసుకుంది. ఈప్రమాదంలో గది మొత్తం కాలిపోయింది. విద్యార్థినుల పుస్తకాలు, కూర్చునే బెంచీలు, 16 వరకు పరుపులు బూడిదయ్యాయి. ఇదే పాఠశాలలో సుమారు 20రోజుల కిందటే అగ్నిప్రమాదం జరిగి 280 పరుపులు కాలిపోయిన ఘటన మరువక ముందే మళ్లీ అగ్నిప్రమాదం జరగడంతో విద్యార్థినుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ప్రమాదం మొదటి అంతస్తులోని స్టాక్ రూంలో సంభవించగా అదే గది కింది రూంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 8.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో విద్యార్థినులు పరుగులు పెట్టారు. తరచూ ప్రమాదాలు జరగడానికి గల కారణాలు తెలియరావడం లేదు. ఈ ప్రమాదం విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో జరిగిందా? మరే ఇతర కారణామా? ఇంకా స్పష్టత లేదు.
Updated Date - Jul 08 , 2025 | 11:57 PM