Festival for Schools పాఠశాలలకు పండుగ
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:12 AM
Festival for Schools జిల్లాలో గురువారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ (పీటీఎం)కు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సర్వాంగ సుందరంగా మస్తాబయ్యాయి. అన్నిచోట్లా స్వాగత తోరణాలు, తల్లిదండ్రులు ఫొటోలు తీసుకోవడానికి అనువుగా ఫొటోబూత్‌లను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహణ
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
గిన్నీస్‌బుక్‌లో నమోదయ్యే అవకాశం
పార్వతీపురం/సాలూరు రూరల్, జూలై 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ (పీటీఎం)కు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సర్వాంగ సుందరంగా మస్తాబయ్యాయి. అన్నిచోట్లా స్వాగత తోరణాలు, తల్లిదండ్రులు ఫొటోలు తీసుకోవడానికి అనువుగా ఫొటోబూత్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇంటింటికెళ్లి ఆహ్వాన పత్రికలందించారు. ముఖ్యలను పిలిచారు. ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఓ సాక్షిని సైతం నియమించారు. ఉదయం తొమ్మిది గంటలకు తల్లిదండ్రులు సమావేశానికి రానున్నారు. వారికి ముగ్గులు, క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థుల ప్రగతిపై వారితో టీచర్లు చర్చించనున్నారు. తల్లిదండ్రులు, ఆహ్వానితుల నుంచి పాఠశాల అభివృద్ధికి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకం, విద్యామిత్ర కిట్లు, ప్రభుత్వ పథకాలతో పాటు సైబర్ నేరాలు, డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించనున్నారు. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామసభలు , విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలు రికార్డులు నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మెగా పీటీఎం కూడా గిన్నిస్‌బుక్‌లో నమోదయ్యే అవకాశం కనిపిస్తోందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ,పైవేట్ పాఠశాలలు 1708 జూనియర్ కళాశాలలు 74 వరకూ ఉన్నాయి. వాటిల్లో 1,29,730 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా మెగా పీటీఎంకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హాజరు కానున్నారు. కాగా ప్రత్యేక శ్రద్ధతో మెగా పీటీఎం నిర్వహించి విజయవంతం చేయాలని ఇన్‌చార్జి డీఈవో బి.రాజకుమార్ కోరారు.
తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం
సాలూరు రూరల్: తల్లి పేరుతో విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఉన్న 1508 పాఠశాలల్లో నాలుగు నుంచి పది తరగతుల విద్యార్థులు ఒకటి నుంచి మూడు వరకు మొక్కలను తెచ్చి.. మెగా పీటీఎం కార్యక్రమంలో అందజేయనున్నారు. ఆ మొక్కలను పాఠశాల ఆవరణ లేదా ఇంటి వద్ద, పొలం వద్ద, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో నాటి సంరక్షించాల్సి ఉంది. ఈ మొక్క బాగోగుల నమోదుకు గ్రీన్ పాస్‌పోర్ట్ కార్డులను సైతం విద్యార్థులకు అందించనున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మొక్కలు అందించారు.
నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్
గరుగుబిల్లి: మెగా పీటీఎం 2.0పై నిర్లక్ష్యం వహించరాదని, గురువారం పక్కాగా ఈ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఉల్లిభద్ర మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలను వేసి జవాబులు రాబట్టారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విధిగా పీటీఎం నిర్వహించాలన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ఎంఈవోలకు ముందుగానే పంపించామన్నారు. నిర్వహణలో లోపాలు ఉన్నట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. ఎటువంటి గొడవల్లేకుండా ప్రశాంతంగా నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో ఎంఈవోలు ఎస్.సింహాచలం, కె.కొండలరావు, హెచ్‌ఎం శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 12:12 AM