జూలై వచ్చినా ఇంకా లోటే
ABN, Publish Date - Jul 03 , 2025 | 11:39 PM
జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూలై మొదటి వారం పూర్తవుతున్నా ఇంకా లోటు వర్షపాతమే నెలకొంది. చిరుజల్లులు తప్పా భారీ వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు
- జూన్‌లో నిరాశపరిచిన వానలు
- చిరుజల్లులు తప్ప భారీ వర్షాల్లేవు
-మందకొడిగా వ్యవసాయ పనులు
పాలకొండ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూలై మొదటి వారం పూర్తవుతున్నా ఇంకా లోటు వర్షపాతమే నెలకొంది. చిరుజల్లులు తప్పా భారీ వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెల జూన్‌లో అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదు. జిల్లా వ్యాప్తంగా ఆ నెల మొత్తం మోస్తరు వర్షాలు కురిశాయే తప్పా ఎక్కడా భారీ వానలు పడలేదు. ఏప్రిల్, మే నెలల్లో ప్రతిఏటా కురవాల్సిన వర్షాల కంటే ఎక్కువగా కురిశాయి. ఆ వానల కారణంగా వేసవి దక్కులను సక్రమంగా రైతన్న చేపట్టలేకపోయాడు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు మందకొడిగా సాగుతున్నాయి. జిల్లాలో 15 మండలాలు ఉండగా కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే వర్షపాతం కాస్త అధికంగా నమోదైంది. కురుపాం, జియ్యమ్మవలస, పార్వతీపురం, బలిజిపేట మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో తక్కువగా నమోదైంది. జిల్లాలో ఈ నెలలో అధికంగా వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వానలు పడితే ఖరీఫ్ పనులు ముమ్మరం కానున్నాయి.
జూన్‌లో 21.6శాతం లోటు వర్షపాతం..
జిల్లాలో గత నెలలో 140.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, 110.3 మి.మీ మాత్రమే నమోదైంది. దీంతో 21.6 శాతం లోటు నెలకొంది. ఏప్రిల్‌లో 36.1 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 72.9 మి.మీ వర్షం కురిసింది. అంటే రికార్డు స్థాయిలో 101.9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మేలో 117.1 మిల్లీమీటర్లకు గాను 144.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 23.6 శాతం అధికంగా వర్షం కురిసింది.
Updated Date - Jul 03 , 2025 | 11:39 PM