Will It Ever Be Closed? ఏడాదైనా.. పూడ్చరా?
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:56 PM
Even After a Year… Will It Ever Be Closed? గత ఏడాదిలో కురిసిన భారీ వర్షాలకు సీతంపేట ఏజెన్సీలోని గొయిది సమీపంలో ఉన్న గుమ్మగెడ్డ రిజర్వాయర్‌కు గండి పడింది. అయితే ఇంతవరకు దానిని పూడ్చలేదు. దీంతో గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటికి కటకటలాడుతున్నారు.
గిరిజన రైతులకు తప్పని సాగునీటి కష్టాలు
ప్రారంభమైన ఖరీఫ్ సీజన్
పట్టించుకోని అధికారులు
సీతంపేట రూరల్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): గత ఏడాదిలో కురిసిన భారీ వర్షాలకు సీతంపేట ఏజెన్సీలోని గొయిది సమీపంలో ఉన్న గుమ్మగెడ్డ రిజర్వాయర్‌కు గండి పడింది. అయితే ఇంతవరకు దానిని పూడ్చలేదు. దీంతో గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటికి కటకటలాడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పనులెలా చేపట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గండి కారణంగా రిజర్వాయర్‌లోని నీరు బయటకు పోవడంతో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గండిని పూడ్చి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
320 ఎకరాలకు సాగునీరు
గుమ్మగెడ్డ రిజర్వాయర్ కింద ఏజెన్సీలోని 320 ఎకరాలు సాగవుతున్నాయి. గొయిది, నారాయణదాస్‌పేట, కొండపేట, పత్తికగూడ, కిండంగి గ్రామాల్లో గిరిజన రైతులకు చెందిన భూములకు ఈ రిజర్వాయర్ నుంచి వచ్చే నీరే ఆధారం. ఆ భూముల్లో ఎక్కువగా వరిని పండిస్తున్నారు. అయితే గత ఏడాదిలో ఈ గుమ్మగెడ్డ రిజర్వాయర్‌కు గండి పడింది. అప్పట్లో పంట భూములన్నీ నీటమునిగాయి. ఆ తర్వాత గిరిజన రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గండిని పూడ్చాలని ఏడాది కాలంగా రైతులు కోరుతున్నా.. అటు ఐటీడీఏ కానీ ఇటు ఇరిగేషన్‌శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. అప్పట్లో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు రిజర్వాయర్‌ను పరిశీలించి గండి పూడ్చేందుకు అంచనాలు వేశారు. కానీ ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభించలేదని రైతులు కొండగొర్రి త్రినాథరావు, సింహాచలం, తోరిక దుర్గారావు, రంగారావు, సరస్వతి, ,శంకర్రావు, శరత్, నారాయణ తదితరులు వాపోయారు.
పనులు ప్రారంభించాలి
గుమ్మగెడ్డ రిజర్వాయర్‌కు పడిన గండిని పూడ్చాలి. దాని గేటుకు రెండు షట్టర్లు బిగించి, జలాశయంలో సిల్క్ తీయాలి. రిజర్వాయర్ గట్టుపై జంగిల్ క్లియరన్స్ వంటి పనులు చేపట్టాలి. రిజర్వాయర్‌లో సిల్క్ ఎక్కువగా పేరుకుపోవడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గింది. త్వరితగతిన పనులు ప్రారంభించకుంటే ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగునీటికి ఇబ్బందులు తప్పవు. పంటభూములు బీడు వారే ప్రమాదం ఉంది.
- కుండంగి అప్పలనాయుడు, గిరిజన రైతు
========================
ఆ నీరే ఆధారం..
మా సాగు భూములకు గుమ్మగెడ్డ రిజర్వాయర్ ద్వారా వచ్చే నీరే ఆధారం. గత ఏడాది వర్షాలకు జలాశయం మదుము వద్ద గండి పడింది. దీంతో మా పొలాలకు బట్ట్టీ ద్వారా నీరు రావడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందును విత్తనాలు జల్లే పనులు ప్రారంభించాం. జలాశయం పనులు యుద్ధప్రాతిపదికన చేయకుంటే ఈఏడాది కూడా సాగునీరు అందదు. దీనిపై అధికారులు స్పందించాలి.
- ఊయక వరలక్ష్మి, రైతు, పత్తికగూడ
===============================
ఇరిగేషన్ ఏఈ ఏమన్నారంటే...
‘గుమ్మగెడ్డ రిజర్వాయర్‌కు చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూ.13లక్షలతో అంచనాలు రూపొందించాం. నిధులు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. రిజర్వాయర్ మదుము వద్ద గండి పడలేదు. మదుము కింద భాగం వైపు నుండి నీరు లీకై పొలాలవైపు వెళ్తున్నట్లు గుర్తించాం. అయితే నిధులు విడుదలైన తరువాత పనులు చేపడతాం.’ రెగ్యులర్ ఇరిగేషన్ ఏఈ పి.మధు తెలిపారు.
Updated Date - Jun 22 , 2025 | 11:56 PM