Elephants హడలెత్తిస్తున్నాయ్..!
ABN, Publish Date - May 02 , 2025 | 11:46 PM
Elephants Stirring Up Fear భామిని మండలం దిమ్మిడిజోలలో ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. శుక్రవారం ఆ గ్రామ తోటల్లో అవి దర్శనమిచ్చాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తి పోతున్నారు.
భామిని, మే 2 (ఆంధ్రజ్యోతి): భామిని మండలం దిమ్మిడిజోలలో ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. శుక్రవారం ఆ గ్రామ తోటల్లో అవి దర్శనమిచ్చాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తి పోతున్నారు. కొద్దిరోజులుగా పసుకుడి ప్రాంతంలో సంచరించిన గజరాజులు గురువారం రాత్రి వంశధార నది తీరం నుంచి భామిని, లివిరి, ప్రాంతాల మీదుగా దిమ్మిడిజోలకు వచ్చాయి. నాలుగు ఏనుగుల గుంపు మళ్లీ తాలాడ వైపు గాని, లేదా గ్రామంలోని కొండ మీదకైనా వెళ్లే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అయితే తమ పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లకముందే అధికారులు స్పందించి.. వాటిని తరలించాలని వారు కోరుతున్నారు. ఏనుగుల సంచారంపై అటవీశాఖాధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో బురదమయమైన పొలాల్లోకి గజరాజులు వెళ్లవని వారు తెలిపారు.
సుంకి నుంచి తోటపల్లికి..
గరుగుబిల్లి: గత కొద్దిరోజులుగా సుంకిలో సంచరించిన ఏనుగులు శుక్రవారం తోటపల్లి ప్రాంతానికి చేరుకున్నాయి. ఆ గ్రామంలో వ్యవసాయ సామగ్రి, పామాయిల్ తోటలోని డ్రిప్ పరికరాలు, కోకో, మామిడి, అరటి, వరి పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో గజరాజుల గుంపు సంచరించడంతో వ్యవసాయ పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మరోవైపు అటవీ సిబ్బందితో పాటు ట్రాకర్లు తోటపల్లి నాగావళి నది సమీపంలోని పంప్ హౌస్ ప్రాంతానికి ఏనుగులను తరలించారు.
Updated Date - May 02 , 2025 | 11:46 PM