సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు
ABN, Publish Date - Jun 12 , 2025 | 11:18 PM
సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు.. వారు పెట్టే ప్రలోభాలకు లొంగి మోసపోవద్దని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు.. వారు పెట్టే ప్రలోభాలకు లొంగి మోసపోవద్దని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు బదులివ్వద్దని, డిజిటల్ అరెస్టులు లాంటివి లేవని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘డిజిటల్ అరెస్టు అని ఎవరైనా చెబితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. మొబైల్‌లో ఎలాంటి బెట్టింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు షేర్ చేయవద్దు. అలా చేసి ఇబ్బందులు, లేని సమస్యలను కొన్ని తెచ్చుకోవద్దు. బెట్టింగ్ యాప్‌లు ఉపయోగించినా, ఇతరులకు ప్రమోట్ చేసినా చట్టరీత్యా నేరం. మీకు లాటరీ తగిలింది.. గెలిచారు.. మీకు పాస్‌వర్డ్ వస్తుంది.. లేదా మీ మొబైల్‌కు వచ్చే పిన్ నెంబర్ చెప్పడంటూ సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వివరాలు ఎవరికీ తెలియజేయవద్దు. స్ర్కాచ్ చేయండి.. రివార్డు పొందండి అని వచ్చే సందేశాలను క్లిక్ చేసి ఓపెన్ చేయవద్దు. ఏపీకే పేరు మీద డాక్యుమెంట్లు వస్తుంది. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదు. ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేయాలి.’ అని కలెక్టర్ పేర్కొన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 11:18 PM