మాటలతో ప్రజలను మభ్యపెట్టవద్దు: ఎమ్మెల్సీ
ABN, Publish Date - Jul 06 , 2025 | 12:00 AM
మాటలతో ప్రజలను మభ్య పెట్టవద్దని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కోరారు.ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాటలు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని తెలిపారు.
శృంగవరపుకోట రూరల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మాటలతో ప్రజలను మభ్య పెట్టవద్దని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కోరారు.ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాటలు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని తెలిపారు.శనివారం బొడ్డవరలో ఆయన విలే కరులతో మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు ఈప్రాంతంలో వస్తాయని, అందకే స్వాగతించాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, తదితరులు చెబుతున్నారన్నారు. రెండురోజుల కిందట జరిగిన జడ్పీ సమా వేశంలో తాను ప్రశ్నించిన అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టిలో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు అంశం లేదని చెప్పడం విస్మయం కలిగించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విజన్-2047 నివేదికలో కొత్తవలసలో పతంజలి పార్కు,ఇతర పరిశ్రమల ఏర్పాటు వంటివి ఉన్నాయని, ఇందులో ఎస్.కోట మండలంలోని జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు గురించి ఎక్కడ లేదన్న విషయాన్ని వివరించారన్నారు.తనను కొందరు ప్రభుత్వ వ్యతిరేకిగా ముద్రవేస్తున్నారని, జిందాల్ పరిశ్రమ ఏర్పాటు కోసం తాను ఈప్రాంత వాసులను ఒప్పించి వందలఎకరాలు భూములు ఇప్పించా నని పరిశ్రమ రాకపోయే సరికి తన ఇంటికి వచ్చి ప్రశ్నిస్తున్నారన్నారు.
Updated Date - Jul 06 , 2025 | 12:00 AM