కౌలు రైతుకు గుర్తింపేదీ?
ABN, Publish Date - Jun 12 , 2025 | 11:28 PM
జిల్లాలో కౌలు రైతులకు గుర్తింపు లభించడం లేదు. వారికి పంట సాగుదారు హక్కు కార్డులు (సీసీఆర్‌సీ) అందజేయడంలో అధికారులు తాత్సారం చేస్తోన్నారు.
- సీసీఆర్‌సీ జారీలో అధికారుల తాత్సారం
- జిల్లాలో 8,250 మంది కౌలు రైతులు
- ఇప్పటి వరకు 800 మందికే కార్డుల అందజేత
- ప్రభుత్వ పథకాలు కోల్పోతున్న వైనం
పాలకొండ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కౌలు రైతులకు గుర్తింపు లభించడం లేదు. వారికి పంట సాగుదారు హక్కు కార్డులు (సీసీఆర్‌సీ) అందజేయడంలో అధికారులు తాత్సారం చేస్తోన్నారు. కనీసం పది శాతం మందికి కూడా కార్డులు అందలేదు. దీంతో వారు ప్రభుత్వ పథకాలు, రాయితీలకు దూరమవుతున్నారు. కౌలు రైతులను గుర్తించాలని, వారికి అవసరమైన పంట సాగుదారు హక్కు కార్డులు అందజేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు ఆదేశాలు జారీ చేసింది. 2025 ఖరీఫ్ సీజన్‌లో పార్వతీపురం మన్యం జిల్లాలో 8,250 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనిలక్ష్యంగా నిర్దేశించింది. అయితే, జిల్లాలో ఇప్పటివరకు కేవలం 800 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు అందజేశారు. రెవెన్యూ, వ్యవసాయశాఖలు సమన్వయంతో పనిచేసి కౌలు రైతులను గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ, జిల్లాలో ఆ విధంగా అడుగులు పడడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌలు రైతుకు గుర్తింపు కార్డు రావాలంటే సంబంధిత భూ యజమానుల నుంచి అంగీకార పత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. ఇందుకు అధిక శాతం మంది భూ యజమానులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో కౌలుదారులు గుర్తింపు కార్డులు పొందడం గగనమవుతుంది.
కౌలు గుర్తింపు కార్డుతో ప్రయోజనాలివే..
కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఉంటే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో తమ పంటలను నేరుగా విక్రయించుకోవచ్చు. బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే వారికి నష్ట పరిహారం, బీమా సదుపాయం అందుతుంది. ఎరువులు, విత్తనాలపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు సైతం వర్తిస్తాయి.
అడ్డంకులు ఎన్నో..
ప్రస్తుతం కౌలు చట్టంలోని నిబంధనలు కౌలు రైతులకు గుదిబండగా మారుతున్నాయి. 2005లో కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం భూ యజమానులతో సంబంధం లేకుండా వాస్తవ కౌలు, సాగుదారులను రెవెన్యూ అధికారులు గుర్తిస్తే చాలు వారికి వ్యవసాయశాఖ అధికారులు రుణ అర్హత కార్డులు ఇచ్చేవారు. తద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేది. 2009 వరకు ఇదే విధంగా కౌలు రైతులను గుర్తించేవారు. అయితే, 2009 తర్వాత సీసీఆర్‌సీ విధానం అమల్లోకి రావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ విధానంలో భూ యజమాని అంగీకార ప్రతం తప్పనిసరి అయింది. దీంతో అధిక సంఖ్యలో భూయజమానులు అంగీకారం పత్రం ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఈ పత్రం ఇస్తే భూమి మీద హక్కును కోల్పోతామని, ప్రభుత్వ రాయితీలు అందవనే అనుమానంతో వారు వెనుకంజ వేస్తున్నారు. కొంతమంది భూ యజమానులు కౌలుకు ఇచ్చే భూముల మీద ముందుగానే వ్యవసాయ రుణాలు తీసుకుంటున్నారు. దీంతో ఆ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులు రుణ అర్హత కోల్పోతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు భూ యజమానులను ఒప్పించడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా కౌలురైతులు సీసీఆర్ కార్డులను పొందలేకపోతున్నారు.
నిబంధనలు సడలించాలి
కౌలు చట్టం నిబంధనలతో కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. భూ యజమానుల నుంచి ఒప్పంద పత్రం తీసుకొని కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందడం సాధ్యం కాదు. ఈ నిబంధనలు సడలించి కౌలుదారులను గుర్తించి భూ యజమానులకు ఇచ్చే అన్ని రకాల సబ్సిడీ రుణాలు, పరిహారాలు అందించాలి.
-కిమిడి రామ్మూర్తినాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
అధికారులు స్పందించాలి
కౌలు చట్టం ద్వారా లభించే ఉపయోగాలను కౌలు రైతులకు వివరించడంలో అధికార యం త్రాంగం విఫలమవుతుంది. దీంతో కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందేందుకు ముందుకు రావడం లేదు. అలాగే కౌలు రైతులకు ఇచ్చే గుర్తింపు కార్డులతో భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధికారులు వివరించాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
- బుడితి అప్పలనాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
గుర్తింపు కార్డులు అందజేస్తాం
జిల్లాలో కౌలు రైతుల గుర్తింపునకు లక్ష్యాలు నిర్దేశించాం. ప్రతి మండలం నుంచి కౌలు రైతుల గుర్తింపునకు రెవెన్యూ, వ్యవసాయశాఖలు ముందుకు వెళ్లాలి. ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డు అందజేస్తాం.
- రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయాధికారి
Updated Date - Jun 12 , 2025 | 11:28 PM