Conspiracy of explosions on the land of birth? జన్మనిచ్చిన గడ్డపైనే పేలుళ్ల కుట్ర?
ABN, Publish Date - May 23 , 2025 | 12:41 AM
Conspiracy of explosions on the land of birth? ఊపిరి పోసుకున్న నేలపైనే రక్తపుటేర్లు పారించాలని చూశాడా? జన్మనిచ్చిన స్థలంలోనే అమాయక ప్రజల మృత్యుఘోషను వినాలనుకున్నాడా? విజయనగరంలో భారీ పేలుళ్ల కుట్రను ఛేదించి ఉండకుంటే పెనునష్టం సంభవించి ఉండేదా? ఎఫ్‌ఐఆర్ నివేదిక పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నీ నిజమేనన్న భావన కలగకమానదు.
జన్మనిచ్చిన గడ్డపైనే
పేలుళ్ల కుట్ర?
గుర్తించకపోయి ఉంటే భారీ నష్టమే!
మూడు నెలలుగా నగరంపై కౌంటర్ ఇంటిల్‌జెన్స్ నిఘా
కొనసాగుతున్న ఎన్‌ఐఎ దర్యాప్తు
రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) ?
నేడు పోలీస్ కస్టడీకి ఎ1 సిరాజ్, ఎ2 సమీర్
విజయనగరం/క్రైం మే 22 (ఆంధ్రజ్యోతి)
ఊపిరి పోసుకున్న నేలపైనే రక్తపుటేర్లు పారించాలని చూశాడా? జన్మనిచ్చిన స్థలంలోనే అమాయక ప్రజల మృత్యుఘోషను వినాలనుకున్నాడా? విజయనగరంలో భారీ పేలుళ్ల కుట్రను ఛేదించి ఉండకుంటే పెనునష్టం సంభవించి ఉండేదా? ఎఫ్‌ఐఆర్ నివేదిక పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నీ నిజమేనన్న భావన కలగకమానదు. మతోన్మాదంతో నిందితుడు సిరాజ్ పెద్ద కుట్రే పన్నినట్లు అనుమానాలున్నాయి. ఈ నెల 21,22 తేదీల్లో పేలుళ్లకు పక్కా ప్రణాళిక వేసినట్టు పోలీస్‌లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. గగుర్బాటు కలిగించే అంశాలు బయటపడడంతో జిల్లా వాసులు ఉలిక్కిపడుతున్నారు.
విజయనగరం వాసి సిరాజ్ కదలికలపై ఆంధ్రా, తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు గత ఆరు నెలలుగా ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే ఎన్‌ఐఏ అధికారులు ఇచ్చిన సమాచారంతో మూడునెలలుగా కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు జిల్లా కేంద్రంలోనే ఉంటూ సిరాజ్‌పై డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్రలు పన్నినట్లు నిర్ధారణకు వచ్చి తరచూ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఈ నెల 16న సిరాజ్‌ను వల వేసి పట్టుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారించటంతో పోలీసు అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆ వెంటనే అప్రమత్తమైన అధికారులు సిరాజ్ వద్ద ఉన్న పేలుళ్ల సామగ్రిని స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి నగరంలో వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు. అనుమానం వచ్చిన ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించి మరిన్ని క్లూలు సేకరిస్తూ వస్తున్నారు. వీరికి తోడుగా జిల్లా పోలీస్ యంత్రాంగం సిరాజ్ కుటుంబీకులతో పాటు స్కూల్ వయసు నుంచి అతనితో పరిచయం ఉన్న స్నేహితుల వివరాలపై ఆరా తీస్తున్నారు. మొత్తం ఎపిసోడ్‌లో దర్యాప్తు అధికారులు, ఆంధ్రా , తెలంగాణ కౌంటర్ ఇంటిల్‌జెన్స్ అధికారులు, స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ పలువురితో ప్రత్యేక కోడ్ భాషలో మాట్లాడుతున్నట్లు కూడా గుర్తించారు.
ఫ సిరాజ్ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిశాక ఎన్‌ఐఏ అధికారులు ఢిల్లీ నుంచే ఆపరేషన్ మొదలు పెట్టారు ఆపై ఆంధ్రా, తెలంగాణలో విధులు నిర్వహించే ఆ సంస్థ అధికారులు నగరానికి వచ్చి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ సమాచారం సేకరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో సిరాజ్‌కు ఎవరైనా సహకరించారా అనేదీ ఆరా తీస్తున్నారు. స్థానికంగా సిరాజ్‌కు పేలుడు సామగ్రిని అమ్మిన వ్యాపారులతో ఇప్పటికే మాట్లాడారని తెలిసింది.
రంగంలోకి యాంటీ టెర్రరిస్టు స్కాడ్ !
పెలుళ్ల కుట్రలో దర్యాప్తు మరింత వేగవంతం చేసేందుకు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్)రంగంలోకి దిగినట్లు సమాచారం. టెర్రరిస్టుల మూలాలు, వారి కార్యకలాపాలు వెలికితీయడంలో ఈ విభాగం అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది.
లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నం
సిరాజ్ పేరున అనేక బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నట్లు తెలిసిందే.. జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో సిరాజ్ పేరున అకౌంట్ ఉండగా తండ్రి పేరున లాకర్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సిరాజ్‌ను రిమాండ్‌కు తరలించిన తరువాత ఆయన తండ్రి లాకర్ ఓపెన్ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఇంతలా లాకర్ ఓపెన్ చేసేందుకు ఎందుకు ఆరాట పడుతున్నాడు..ఇంతకీ ఆ లాకర్‌లో ఏముంది.. అన్న ప్రశ్నలు పోలీసులు, ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లో లావాదేవీలను ఆర్‌బీఐ ఆదేశాలతో నిలిపివేసినట్లు సమాచారం.
పోలీస్ కస్టడీకి సిరాజ్, సమీర్‌లు
పేలుళ్ల కుట్ర కేసు నిందితులు ఏ1 సిరాజ్ , ఏ2 సమీర్‌ల నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీస్ కస్టడికీ ఇవ్వాలని టూటౌన్ పోలీస్‌లు న్యాయస్థానంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు వాదనలు విన్న తరువాత సిరాజ్, సమీర్‌లను ఏడు రోజులు కస్టడికీ ఇస్తూ విజయనగరం అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో శుక్రవారం నిందితులను జైలునుంచి విజయనగరం తీసుకురానున్నారు. సిరాజ్, సమీర్‌ల పోలీస్ కస్టడీతో మరిన్ని కీలక ఆధారాలు బయట పడే అవకాశం ఉంది. వారితో సీన్ రికనస్ట్రక్షన్ చేస్తారని కూడా సమాచారం.
----------------
Updated Date - May 23 , 2025 | 12:41 AM